సైకిల్‌పై వచ్చి చోరీ.. వీడియో తీస్తూ నిలబడిన కస్టమర్లు.. | Watch: San Francisco Man Daylight Shoplifting Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

సైకిల్‌పై వచ్చి చోరీ.. వీడియో తీస్తూ నిలబడిన కస్టమర్లు..

Published Fri, Jun 18 2021 2:02 PM | Last Updated on Sat, Jun 19 2021 3:57 PM

Watch: San Francisco Man Daylight Shoplifting Video Goes Viral On Social Media	 - Sakshi

కాలిఫోర్నియా: అరవై నాలుగు కళలలో​ ‘చోరకళ’ కూడా ఒకటి. అయితే, చోరీకి పాల్పడే క్రమంలో కొంత మంది ఎక్కడ దొరికి పోతామో అని టెన్షన్‌ పడితే.. మరికొంతమంది మాత్రం ఎలాంటి ఆందోళన లేకుండా వచ్చిన పనిని తేలికగా ముగించుకుని కూల్‌గా వెళ్లిపోతుంటారు. ఇప్పటికే దొంగతనానికి సంబంధించిన ఎన్నో వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా  కాలిఫోర్నియాలో ఒక వ్యక్తి షాపులో ప్రవేశించి కూల్‌గా దొంగతనం ముగించుకుని స్టైల్‌గా జారుకున్నాడు.

నల్లని జాకెట్‌, ముఖానికి నలుపు రంగుబట్ట చుట్టుకుని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న వాల్‌గ్రీన్స్‌లోని ఒక షాపులో సైకిల్‌ మీద ప్రవేశించాడు. అంతటితో ఆగకుండా ఒక నల్లని కవర్‌ను తీశాడు. వెంటనే అక్కడ ఉన్న వస్తువులన్నీ తన కవర్‌లో వేసుకున్నాడు. ఆ షాపులో ఉన్న కస్టమర్లు అతడిని అనుమానంగా చూశారు. కానీ ఎవరు కూడా అతగాడి దగ్గరకు వెళ్లి ఆపే సాహసం చేయలేదు. ఇక్కడ విడ్డూరమేంటంటే ఆ షాపు సెక్యూరిటీ కూడా దూరం నుంచి ఈ తతంగాన్ని వీడియో తీస్తూ ఉండిపోయాడు. ఆ దొంగ పని ముగించుకొని సైకిల్‌పై వెళ్లిపోయే క్రమంలో.. సెక్యూరిటీ అతడిని ఆపటానికి ప్రయత్నించాడు.

కానీ, దొంగ ఎంతో చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకొని దర్జాగా వెళ్లిపోయాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ పుటేజ్‌లో రికార్డ్‌ అయ్యింది. ఈ దొంగతనం జరిగే సమయంలో లియాన్నే మెలెండెజ్‌ అనే జర్నలిస్టు అక్కడే ఉంది. 'నేను ఆ చోరీని అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. మా నగరంలో ఇలాంటివి తరచుగా జరుగుతుంటాయి. ఈ షాపులోనే కాదూ... ఇళ్లలోని వస్తువులను, కార్లను కూడా దొంగతనం చేస్తారు' అని ఆమె చెప్పుకొచ్చింది.. అయితే, శాన్‌ఫ్రాన్సిస్కోలో కొన్ని వివాదస్పద చట్టాలు ఉన్నాయి. దీని ప్రకారం,  తక్కువ ధర ఉన్న వస్తువులను చోరీ చేస్తే విధించే శిక్షలను, జరిమానాలను తగ్గించారు. దీంతో కొంత మంది చిల్లర దొంగలు రెచ్చిపోయి చోరీలకు పాల్పడుతున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘నీ చోరకళ భలే ఉంది బాసు..’, ‘ఏమైనా నీ ధైర్యానికి హ్యాట్సాఫ్‌..’, ‘ఇంత జరుగుతున్న కొంత మంది కస్టమర్లున్నారే.. వారిని..’, ‘పాపం.. ఒక్కటే కష్టపడుతున్నాడు.. కాస్త సహాయం చేయొచ్చుగా..’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 

చదవండి: నీటిలో గాలి బుడగలు ఊదుతున్న శునకం.. ఫన్నీ వీడియో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement