లండన్: ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కరోనా వైరస్ నివారణకు సంబంధించి యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మారిని అంతం చేయడం అంత సులభం కాదని ఆయన వ్యాఖ్యానించారు. వైరస్‌తో కలిసి జీవించడాన్ని ప్రజలంతా నేర్చుకోవలసి ఉంటుందని సూచించారు. ప్రెస్ అసోసియేషన్‌తో మాట్లాడుతూ కోవిడ్-19తో కలిసి జీవించబోతున్నాం. దానిని నివారించలేమని టోనీ బ్లెయిర్ హెచ్చరించారు. అలాగే నియంత్రణ చర్యలపై దృష్టి పెట్టాలని బోరిస్ జాన్సన్ ప్రభుత్వాన్ని కోరారు. 'ప్రభుత్వం ఇప్పటివరకు ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు' ఇదని కరోనా సంక్షోభాన్నిఆయన అభివర్ణించారు.
రానున్న చలికాలంలో మహమ్మారి రెండవ దశలో మరింత విజృంభించే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు బ్రిటన్ ప్రజలంతా సంసిద్ధంగా ఉండాలని టోనీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి మనల్ని వదిలి ఎక్కడికీ పోదు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కలిసి బ్రతకడం అలవాటు చేసుకోవాలన్నారు. అలాగే మరింత నియంత్రణ చర్యలు చేపట్టాలని పాలకులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివిధ దేశాల్లో లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుల తర్వాత కేసుల సంఖ్య భారీగా పుంజుకోవడాన్ని ఆయన గుర్తు చేశారు.
ఆర్థిక సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా దీర‍్ఘకాలికంగా లాక్‌డౌన్ విధించడం అసాధ్యం. కానీ కరోనా కట్టడికి దీర్ఘకాలిక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యం. దురదృష్టవశాత్తు కరోనా మళ్లీ వ్యాప్తిస్తే దేశంలో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవనేదే తనకు అందోళన కలిగిస్తున్న అంశమని ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment