tony blair
-
బ్రిటన్ మాజీ ప్రధాని బ్లెయిర్‌కు ‘నైట్‌హుడ్’
లండన్: బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్ను బ్రిటన్ రాణి ఎలిజబెత్ నైట్‌హుడ్ హోదాతో సత్కరించారు. ఇకపై బ్లెయిర్.. ‘ఆర్డర్ ఆఫ్ గార్డర్’ సభ్యునిగా కొనసాగుతారు. అవిశ్రాంతంగా ప్రజాసేవ చేసిన వారిని బ్రిటిష్ ప్రభుత్వం 1348వ సంవత్సరం నుంచి ఇలా నైట్‌హుడ్ హోదాతో గౌరవిస్తోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సలహాతో సంబంధం లేకుండానే రాణి ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇకపై టోనీ బ్లెయిర్ను ‘సర్ టోనీ’ అని గౌరవంగా సంబోధిస్తారు. 68 ఏళ్ల టోనీ బ్లెయిర్ 1997 నుంచి పదేళ్లపాటు బ్రిటన్‌కు ప్రధానిగా సేవలందించారు. బ్రిటన్ మాజీ మంత్రి, నల్ల జాతీయురాలు బరోనెస్ వలేరీ అమోస్(67)కు సైతం నైట్‌హుడ్ హోదా దక్కింది. గృహ హింస, లైంగిక వేధింపులపై అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలతో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్న తన కోడలు కమిల్లాను ‘రాయల్ కంప్యానియన్’గా నియమిస్తూ ఎలిజబెత్ రాణి నిర్ణయం తీసుకున్నారు. -
కరోనా అంతం సాధ్యం కాదు!
లండన్: ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కరోనా వైరస్ నివారణకు సంబంధించి యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మారిని అంతం చేయడం అంత సులభం కాదని ఆయన వ్యాఖ్యానించారు. వైరస్‌తో కలిసి జీవించడాన్ని ప్రజలంతా నేర్చుకోవలసి ఉంటుందని సూచించారు. ప్రెస్ అసోసియేషన్‌తో మాట్లాడుతూ కోవిడ్-19తో కలిసి జీవించబోతున్నాం. దానిని నివారించలేమని టోనీ బ్లెయిర్ హెచ్చరించారు. అలాగే నియంత్రణ చర్యలపై దృష్టి పెట్టాలని బోరిస్ జాన్సన్ ప్రభుత్వాన్ని కోరారు. 'ప్రభుత్వం ఇప్పటివరకు ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు' ఇదని కరోనా సంక్షోభాన్నిఆయన అభివర్ణించారు. రానున్న చలికాలంలో మహమ్మారి రెండవ దశలో మరింత విజృంభించే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు బ్రిటన్ ప్రజలంతా సంసిద్ధంగా ఉండాలని టోనీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి మనల్ని వదిలి ఎక్కడికీ పోదు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కలిసి బ్రతకడం అలవాటు చేసుకోవాలన్నారు. అలాగే మరింత నియంత్రణ చర్యలు చేపట్టాలని పాలకులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివిధ దేశాల్లో లాక్డౌన్ ఆంక్షల సడలింపుల తర్వాత కేసుల సంఖ్య భారీగా పుంజుకోవడాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్థిక సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా దీర్ఘకాలికంగా లాక్డౌన్ విధించడం అసాధ్యం. కానీ కరోనా కట్టడికి దీర్ఘకాలిక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యం. దురదృష్టవశాత్తు కరోనా మళ్లీ వ్యాప్తిస్తే దేశంలో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవనేదే తనకు అందోళన కలిగిస్తున్న అంశమని ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. -
‘దేశ రాజకీయాల్లోకి మళ్లీ నేనొస్తున్నాను..’
లండన్: తాను మరోసారి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్(63) స్పష్టం చేశారు. బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకే తాను తిరిగి దేశీయ రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు. లేబర్ పార్టీ బాధ్యతలను 1994 నుంచి 2007 వరకు నిర్వహించిన టోనీ.. 1997నుంచి దాదాపు పదేళ్లపాటు బ్రిటన్ ప్రధానిగా పనిచేశారు. అయితే, జూన్ 8న జరగనున్న సాధారణ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయడం లేదని చెప్పారు. ప్రజాభీష్టాలకు అనుగుణంగా పనిచేసే ఒక రాజకీయ సంస్థలాంటిదానిని ఏర్పాటుచేసి దాని ద్వారా ప్రజల గొంతును ప్రజల మధ్యే ఉండి వినిపిస్తూ తన బాధ్యతలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. అయితే, తన నిర్ణయం భారీ స్థాయిలో విమర్శలు వస్తాయని కూడా తనకు తెలుసని, అయినా, వాటన్నింటికీ తానే సంపూర్ణ బాధ్యత వహిస్తానని చెప్పారు. టోనీ బ్లేయర్ తాను పదవీ కాలం ముగిసేవరకు కూడా మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా సమస్యలపైనే పెద్ద మొత్తంలో పనిచేసిన ఆయన తాజాగా బ్రెగ్జిట్ విషయంలో ప్రజలు మరోసారి ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బ్రెగ్జిట్ అనే అంశమే మరోసారి రాజకీయాల్లోకి వచ్చేలా తనను పురికొల్పిందని అన్నారు. ఒక చారిత్రాత్మకమైన ఈ సందర్భంలో తాను మౌనంగా ఉండలేనని, అలా ఉంటే తాను తన దేశ బాగోగుల గురించి పట్టించుకోని వాడినవుతానంటూ వ్యాఖ్యానించారు. -
మాజీ ప్రధాని భార్యపై భారీ ఆరోపణలు!
పేరుకు ఆమె నడిపింది ఓ మానవ హక్కుల సంస్థ. కానీ ఓ నియంతకు కొమ్ముకాసి.. భారీగా సొంత ఖజానా నింపుకొంది. మానవ హక్కులను నిలువునా పాతరేసి.. తన సొంత ప్రయోజనాలను దండిగా కాపాడుకుంది. తన భర్త ప్రధానమంత్రి వంటి అత్యున్నత పదవి నిర్వర్తించినప్పటికీ, ఆమె అవినీతికి పాల్పడేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. ఈ మేరకు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ భార్య చెరీ బ్లెయిర్ నిలువునా అవినీతి ఆరోపణల్లో మునిగిపోయి.. ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మాల్దీవులకు చెందిన అవినీతి నియంత అబ్దుల్లా యమీన్‌తో చెరీ బ్లెయిర్ సాగించిన రహస్య ఆర్థిక వ్యవహారాల గూడుపుఠాణీ బట్టబయలైంది. అబ్దుల్లా యమీన్‌కు అండగా నిలిచినందుకు రోజుకు రెండు వేల పౌండ్ల చొప్పున మొత్తం రెండు లక్షలకుపైగా పౌండ్ల సొమ్ము ఆమె కంపెనీకి ముట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. చెరీ కంపెనీ ఒమ్నియా స్ట్రాటెజీకి అక్రమంగా పెద్ద మొత్తం తరలిన ఈ నిధులపై దర్యాప్తు జరిపేందుకు సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్, అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతున్నాయి. మల్దీవులకు నియంత పాలకుడిగా ఉన్నప్పుడు యమీన్ భారీగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన 1700మంది ప్రతిపక్ష కార్యకర్తలను జైళ్లలో బంధించాడు. న్యాయాన్ని అవహేళన చేస్తూ ముగ్గురు ప్రతిపక్ష నేతలను శిక్షించాడు. ఈ నియంత పాలకుడితో చెరీ బ్లేయిర్ సాగించిన అక్రమ ఆర్థిక వ్యవహారాలు తాజాగా డైలీమెయిల్ పత్రిక వెలుగులోకి తెచ్చింది. - నియంతృత్వ పాలకుడైన అబ్దుల్లా యమీన్ తో ఆరు నెలలపాటు పనిచేసేందుకు 4.20 లక్షల పౌండ్లతో చెరీ బ్లెయిర్ ఓ ఒప్పందం చేసుకుంది. - అంతర్జాతీయంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నానని చెప్పుకొనే చెరీ.. నియంత పాలనలో ఉన్న మాల్దీవుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంతో పనిచేస్తున్నట్టు అప్పట్లో ప్రకటించారు. - కానీ నియంత యమీన్‌కు అనుకూలంగా వ్యవహరించినందుకు ఆమె కంపెనీకి అక్రమమార్గంలో ఏకంగా 2.10 లక్షల పౌండ్లు ముట్టాయి. వీటిని ఆయుధ సరఫరా వ్యాపారి, ఉగ్రవాది, ఇంటర్ పోల్ మోస్ట్ వాంటెడ్ నేరగాడు మహమెద్ ఆలం లతీఫ్ ఆమె కంపెనీ ఖాతాలో జమచేయడం గమనార్హం. మల్దీవులు అధ్యక్షుడిగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన మహమ్మద్ నౌషధ్ను సైనిక చర్య ద్వారా అబ్దుల్లా యమీన్ గద్దె దించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కోర్టు విచారణలో న్యాయసహాయం కోసం చెరీ బ్లెయిర్ లీగల్ కంపెనీ 'ఒమ్నియా స్ట్రాటెజీ'ని అబ్దుల్లా యమీన్ గత ఏడాది వేసవిలో నియమించుకున్నారు. అయితే ఈ సంస్థ మానవ హక్కులకు సంబంధించి న్యాయసహాయం కోసం కాకుండా అంతర్జాతీయ మీడియా ముందు నియంత ప్రభుత్వాన్ని సమర్థించడానికి, అంతర్జాతీయ దౌత్య సంబంధాలు మెరుగుపరచడానికి లోపాయికారి సహకారం అందించిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. -
బ్లెయిర్ 'పరివర్తన'
యుద్ధమంటే విమానాలు, ద్రోన్లు కురిపించే బాంబుల వర్షం... శతఘ్నుల మోతలు, క్షిపణి దాడులు...ప్రాణ నష్టం, ఆస్తి నష్టం మాత్రమే కాదు. యుద్ధమంటే సమాజాన్ని నడిపించే సకల వ్యవస్థలపైనా దాడి చేయడం. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక, పర్యావరణ వ్యవస్థలన్నిటినీ రూపురేఖల్లేకుండా ధ్వంసం చేయడం. ఒక్క మాటలో- జీవితాన్ని నిర్మించే, నిలబెట్టే వాటిన్నిటినీ నాశనం చేయడం. మనుషులందరినీ అమానవీకరించడం. ఇరాక్‌లో పన్నెండేళ్లక్రితం ఇంతటి ఘోరకలికి కారకులైనవారిలో ఒకరైన బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తొలిసారి ఆ దురాక్రమణ యుద్ధానికి క్షమాపణ చెప్పారు. ఇరాక్ వద్ద సామూహిక జన హనన ఆయుధాలున్నాయన్న తప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికల కారణంగా ఆ దేశంపై యుద్ధం ప్రకటించామని ఆయన ప్రకటించారు. అయితే అది బేషరతు క్షమాపణ కాదు. అమెరికాతో కలసి సాగించిన ఆ యుద్ధంవల్ల లక్షలాదిమంది మృత్యువాత పడ్డారని... తాము రాజేసిన మంట ఇప్పటికీ ఇరాక్‌ను దహించివేస్తూ నిత్యం అక్కడి పౌరులను బలిగొంటూనే ఉన్నదన్న చింత ఆయనకేమీ లేదు. తమ ప్రణాళికలో... ముఖ్యంగా సద్దాం హుస్సేన్ ప్రభుత్వాన్ని కూలదోశాక ఏం జరిగే అవకాశం ఉందో అంచనా వేయడంలో విఫలమైనందుకు ఆయన బాధపడుతున్నారు. సద్దాంను కూలదోయడం సరైందేనని ఇప్పటికీ బ్లెయిర్ విశ్వసిస్తున్నారు. తమ చర్య పర్యవసానంగా ఇరాక్‌లో తొలుత అల్-కాయిదా, ఆ తర్వాత ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదం వేళ్లూనుకున్నాయన్న వాదనతో ఆయన పూర్తిగా ఏకీభవించడంలేదు. నాలుగేళ్లక్రితం అరబ్ ప్రపంచాన్ని ఊపేసిన ప్రజాస్వామిక ప్రభంజనం కూడా అందుకు దోహదపడిందని వాదిస్తున్నారు. ఐఎస్ పుట్టింది సిరియాలో తప్ప ఇరాక్‌లో కాదని తర్కిస్తున్నారు. జార్జి బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆ దేశంతో కలిసి బ్రిటన్, ఇతర పశ్చిమ దేశాలూ సాగించిన దురాక్రమణ యుద్ధం మానవేతిహాసంలోనే భయానకమైనది. 2003లో ప్రారంభమైన ఆ యుద్ధం పర్యవసానంగా పది లక్షలమందికిపైగా దుర్మరణం చెందారు. మరిన్ని లక్షలమంది వికలాంగులుగా, అనాథలుగా మిగిలారు. మెరుగైన జీవనప్రమాణాలతో ప్రశాంతంగా ఉండే ఇరాక్ ఆ యుద్ధం తర్వాత నిత్య సంక్షుభిత దేశంగా మారిపోయింది. అక్కడ ప్రభుత్వాలు ఏర్పడినా అవి నామమాత్రంగా మిగిలాయి. రెండు ప్రధాన తెగలైన షియా, సున్నీల మధ్య భీకర సంగ్రామం...అందులో భాగంగా చోటుచేసుకునే ఆత్మాహుతి దాడులు ప్రతిరోజూ జనం ఉసురు తీస్తున్నాయి. ఈ తెగల పోరులో పుట్టుకొచ్చిన ఐఎస్ దేశంలో గణనీయమైన ప్రాంతాన్ని తన గుప్పిట బంధించింది. ఇరుగుపొరుగు దేశాలకు సైతం పాకుతూ అందరినీ భయభ్రాంతుల్ని చేస్తోంది. బుష్, బ్లెయిర్ ద్వయం చేసిన నేరాలెలాంటివో, వాటి పర్యవసానాలేమిటో ఇప్పుడు ప్రపంచమంతటికీ తెలుసు. 2003లో దురాక్రమణ యుద్ధానికి పూనుకున్నప్పుడే అనేకులు దాన్ని నిరసించారు. అందుకు చెబుతున్న కారణాల్లో ఏ ఒక్కటీ నిజం కాదని ఎలుగెత్తారు. కేవలం ఇరాక్ చమురు బావులపై కన్నేసి, ఉగ్రవాదాన్ని సాకుగా చూపి ఆ దేశంపై దండెత్తుతున్నారని చెప్పారు. అయినా ఆ మారణహోమాన్ని బుష్, బ్లెయిర్లు ఆపలేదు. యుద్ధం చేయకపోతే ఎప్పుడైనా కేవలం 45 నిమిషాల వ్యవధిలో సద్దాం హుస్సేన్ బ్రిటన్‌పై జన హనన ఆయుధాలను ప్రయోగించే ప్రమాదం ఉన్నదని ఊదరగొట్టారు. సామూహిక జన హనన ఆయుధాల విషయంలో బ్రిటన్‌కు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్(ఎంఐ)6 నివేదికలు తమను పక్కదోవ పట్టించాయని ఇప్పుడు బ్లెయిర్ చెబుతున్నది వాస్తవం కాదు. ఆ నివేదికలు రావడానికి ఏడాది ముందే బ్లెయిర్ ఈ యుద్ధానికి సిద్ధమయ్యారని ఈమధ్యే అమెరికాలో వెల్లడైన నోట్ చెబుతోంది. 2002లో ఆనాటి అమెరికా విదేశాంగమంత్రి కోలిన్ పావెల్ బుష్‌కు పంపిన నోట్ అది. ఈ దురాక్రమణ అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమైనదని, దేశ చట్టాల ప్రకారం కూడా చెల్లుబాటు కాదని బ్రిటన్ న్యాయ విభాగం అధికారులు ఆరోజున మొత్తుకున్నారు. ఆ దేశ పార్లమెంటు సంగతలా ఉంచి, తన కేబినెట్‌కి సైతం సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా బ్లెయిర్ దురాక్రమణకు సై అన్నారు. దురాక్రమణకు దిగితే యుద్ధ నేరాల కింద బోనెక్కే పరిస్థితి ఏర్పడవచ్చునని హెచ్చరిస్తూ ఆ దేశ అటార్నీ జనరల్ లార్డ్ గోల్డ్ స్మిత్ సమర్పించిన నోట్‌ను బ్లెయిర్ కేబినెట్ కంటపడనీయలేదు. ఇంతకూ ఇన్నేళ్ల తర్వాత తొలిసారిగా ఆ యుద్ధం పొరబాటేనని పాక్షికంగానైనా బ్లెయిర్ ఎందుకు ఒప్పుకున్నట్టు? అదీ తమ దేశ మీడియాకు కాక అమెరికాకు చెందిన సీఎన్ఎన్ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడంలోని ఆంతర్యమేమిటి? ఇరాక్ యుద్ధంలో బ్రిటన్ పాత్రపై ఏర్పాటైన జాన్ చిల్కాట్ నేతృత్వంలోని కమిషన్ నివేదిక కోసం బ్రిటన్‌లో అన్ని వర్గాలూ... మరీ ముఖ్యంగా యుద్ధ వ్యతిరేక ఉద్యమకారులు ఎదురుచూస్తున్నారు. నివేదిక సమర్పణలో జాప్యాన్ని ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఏడాది మొదట్లో వెల్లడికానున్న ఆ నివేదికలో బ్లెయిర్ వ్యవహార శైలిపై...ముఖ్యంగా పలు వాస్తవాలను ఆయన తొక్కిపెట్టడంపై నిశితమైన విమర్శలుండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధ నేరస్తుడిగా ఆ నివేదిక నిర్ధారించిన పక్షంలో నలువైపులనుంచీ తనపై దాడి తప్పదని గ్రహించబట్టే పాక్షిక క్షమాపణకైనా బ్లెయిర్ సిద్ధపడ్డారు. ఆ సంగతిని కూడా తమ మీడియాకు చెబితే ప్రస్తుత పరిస్థితుల్లో కాకుల్లా పొడుస్తారన్న భయంతో అమెరికా చానెల్ సీఎన్ఎన్ను ఆశ్రయించారు. యుద్ధమూ, దాని పర్యవసానాలూ క్షమాపణలతో ముగిసిపోయేవి కాదు. అలాంటి నేరానికి పాల్పడేవారు విచారణను ఎదుర్కొనవలసిందే. శిక్షకు సిద్ధపడాల్సిందే. బ్లెయిర్ అయినా, మరొకరైనా అందుకు మినహాయింపు కాదు. -
ఆర్జితం: మాటలు కోట్లు దాటాయి!
మాటలు కోటలు దాటుతుంటాయి కానీ అడుగులు గడప దాటవు అని ఓ చక్కటి సామెత ఉంది. తమాషా ఏంటంటే... మాటలు కోటలు దాటితే చాలు... నువ్వే కోటీశ్వరుడివి అంటోంది ప్రపంచం. అలాంటి మాటల మరాఠీలైన బలియనీర్లు వీళ్లంతా. వీరి సంపాదన మన రూపాయల్లో ఎంతో చూద్దామా! మాట్లాడటం ఒక కళ. ఆ ఒక్క కళ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో విషయాలు సాధించేలా చేస్తుంది. మంత్రాలకు చింతకాయలు రాలతాయో, లేదో తెలియదు గాని కొందరి మాటలకు మాత్రం కోట్లు రాలుతున్నాయి. ప్రపంచంలో కేవలం మాటలతో గంటల్లో లక్షలు, కోట్లు సంపాదించే వారున్నారు. ఈ జాబితాలో ఉన్న వారంతా మీకు ఇంతకుముందు వేరే కారణాలతో పరిచయం అయినవారే. బిల్ క్లింటన్-హిల్లరీ క్లింటన్ ఒకప్పటి అమెరికా అధ్యక్షుడై బిల్ క్లింటన్ టాప్ పెయిడ్ పబ్లిక్ స్పీకర్. ఒక ప్రసంగానికి ఆయన రెండున్నర కోట్ల వరకు తీసుకుంటారట. తక్కువలో తక్కువ అంటే 90 లక్షల రూపాయలకు తగ్గడట. ఆయన భార్య హిల్లరీ కూడా తక్కువేం తినలేదు. ఆమె ఫీజు రూ.1.20 కోట్లు. టోనీ బ్లెయిర్ ఈయన బ్రిటన్ మాజీ ప్రధాని మాత్రమే కాదు గ్రేట్ స్పీకర్ కూడా. ఈయన ప్రధానిగా పదవి చేపట్టాక ప్రసంగాల్లో రాటుదేలారు. ప్రధాని పదవి నుంచి దిగిపోయాక ప్రసంగాలు ఇస్తూ సంపాదించేస్తున్నారు. టోనీ ఒక ప్రసంగానికి వసూలు చేసే ఫీజు కోటిన్నర. రూడీ గిలాని గతంలో న్యూయార్క్ మేయర్‌గా పనిచేశారు. ప్రపంచంలో ఓ పెద్ద నగరానికి మేయరుగా పనిచేసిన అనుభవంతో ఎంతో విషయపరిజ్ఞానం సంపాదించిన రూడీ స్వతహాగా మంచి మాటకారి. విషయం ఉన్నవాడు. అందుకే ఆయన తన ప్రసంగానికి కోటీ అరవై లక్షల ఫీజు వసూలు చేస్తారు. డొనాల్డ్ ట్రంప్ ఈయన ప్రముఖ పారిశ్రామిక వేత్త, టెలివిజన్ పర్సనాలిటీ. అమెరికాకు చెందిన డొనాల్డ్ గలగలా మాట్లాడటంలో ఎంత అనుభవం సంపాదించారు. ఈయన ప్రసంగాలు బుక్ చేసుకోవడానికి ఎన్నో కంపెనీలు క్యూలో ఉండే పరిస్థితి. డబ్బు మాత్రం ప్రసంగానికి రూ.కోటి తీసుకుంటారు. లారీ సమ్మర్స్ లారీ ఒక ఆర్థిక వేత్త. వైట్‌హౌస్ ఎకనమిక్ కౌన్సిల్‌కు ఒకప్పుడు డెరైక్టర్‌గా కూడా పనిచేశారు. ఆర్థిక వ్యవహారాలు, సిద్ధాంతాలపై విపరీతమైన పట్టున్న లారీ హెన్రీ సమ్మర్స్ ప్రసంగానికి 80 లక్షల రూపాయల దాకా ఛార్జ్ చేస్తారట. వీరితో పాటు వర్జిన్ గ్రూప్‌కు చెందిన ఇంగ్లండ్ బిజినెస్‌మ్యాన్ సర్ రిచర్డ్ బ్రాన్సన్, అమెరికన్ ఆర్థిక వేత్త అలాన్ గ్రీన్స్పన్, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు, పర్యావరణ వేత్త అల్గోరె, మాజీ అలస్కా గవర్నర్ అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన సారాపాలిన్లు ఒక్కొక్కరు లక్ష డాలర్లు అంటే దాదాపు 60 లక్షల రూపాయలు ఒక్క ప్రసంగానికి తీసుకుంటారు. ఇంతకీ వీరంతా ఇంత పెద్దమొత్తం తీసుకుని ఏం చెబుతారు అనేదేగా మీ అనుమానం. వ్యాపార విధాన రూపకల్పన, వ్యక్తిత్వ వికాసం, పీపుల్ మేనేజ్మెంట్, ఒప్పంద నిర్వహణ, కార్యనిర్వహణ సామర్థ్యాలు, సమాజం, పర్యావరణం, ఆర్థిక వ్యవహారాలు వంటి అంశాలలో చక్కటి అనుభవ పాఠాలు, తెలివైన సలహాలు ఇస్తుంటారు. 1. రూడీ గిలాని 2. బిల్ క్లింటన్ 3. అలాన్ గ్రీన్స్పన్ 4. హిల్లరీ క్లింటన్ 5. అల్ గోరె 6. రిచర్డ బాన్సన్ 7. టోనీ బ్లెయిర్ -
టోనీ బ్లెయిర్ తనయకు తుపాకీతో బెదిరింపు
ఇంగ్లండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తనయకూ దొంగల బెదిరింపులు తప్పలేదు. తుపాకితో బెదిరించి డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నించారు. ఐతే ఈ సంఘటనలో ఆమెకు ఎలాంటి హానీ జరగలేదు. న్యాయవాది అయిన 29 ఏళ్ల కేథరిన్ ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌తో పాటు కుక్కను తీసుకుని లండన్ ప్రధాన వీధిలో వాకింగ్‌కు వెళ్లింది. ఆ సమయంలో ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు డబ్చు, బంగారు నగలు ఇవ్వాల్సిందిగా వారిని తుపాకీతో బెదిరించారు. ఐతే ఆ సమయంలో వారి వద్ద నగదు, ఖరీదైన వస్తువులు లేవు. దీంతో దొంగలు వారిని వదిలేసి పారిపోయారు. తమకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదని, ఐతే దిగ్ర్భాంతికి గురయ్యామని కేథరిన్ చెప్పింది. మెరిల్‌బోన్ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్టు స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు ధ్రువీకరించారు. పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు.