మాజీ ప్రధాని భార్యపై భారీ ఆరోపణలు! | Cherie Blair facing corruption probe threat over £420,000 deal with a Maldivian despot | Sakshi
Sakshi News home page

మాజీ ప్రధాని భార్యపై భారీ ఆరోపణలు!

Published Thu, Feb 18 2016 12:06 PM | Last Updated on Sat, Sep 22 2018 8:30 PM

మాజీ ప్రధాని భార్యపై భారీ ఆరోపణలు! - Sakshi

మాజీ ప్రధాని భార్యపై భారీ ఆరోపణలు!

పేరుకు ఆమె నడిపింది ఓ మానవ హక్కుల సంస్థ. కానీ ఓ నియంతకు కొమ్ముకాసి.. భారీగా సొంత ఖజానా నింపుకొంది. మానవ హక్కులను నిలువునా పాతరేసి.. తన సొంత ప్రయోజనాలను దండిగా కాపాడుకుంది. తన భర్త ప్రధానమంత్రి వంటి అత్యున్నత పదవి నిర్వర్తించినప్పటికీ, ఆమె అవినీతికి పాల్పడేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. ఈ మేరకు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ భార్య చెరీ బ్లెయిర్ నిలువునా అవినీతి ఆరోపణల్లో మునిగిపోయి.. ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

మాల్దీవులకు చెందిన అవినీతి నియంత అబ్దుల్లా యమీన్‌తో చెరీ బ్లెయిర్ సాగించిన రహస్య ఆర్థిక వ్యవహారాల గూడుపుఠాణీ బట్టబయలైంది. అబ్దుల్లా యమీన్‌కు అండగా నిలిచినందుకు రోజుకు రెండు వేల పౌండ్ల చొప్పున మొత్తం రెండు లక్షలకుపైగా పౌండ్ల సొమ్ము ఆమె కంపెనీకి ముట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. చెరీ కంపెనీ ఒమ్నియా స్ట్రాటెజీకి అక్రమంగా పెద్ద మొత్తం తరలిన ఈ నిధులపై దర్యాప్తు జరిపేందుకు సీరియస్ ఫ్రాడ్‌ ఆఫీస్, అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతున్నాయి. మల్దీవులకు నియంత పాలకుడిగా ఉన్నప్పుడు యమీన్‌ భారీగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన 1700మంది ప్రతిపక్ష కార్యకర్తలను జైళ్లలో బంధించాడు. న్యాయాన్ని అవహేళన చేస్తూ ముగ్గురు ప్రతిపక్ష నేతలను శిక్షించాడు. ఈ నియంత పాలకుడితో చెరీ బ్లేయిర్ సాగించిన అక్రమ ఆర్థిక వ్యవహారాలు తాజాగా డైలీమెయిల్‌ పత్రిక వెలుగులోకి తెచ్చింది.

- నియంతృత్వ పాలకుడైన అబ్దుల్లా యమీన్‌ తో ఆరు నెలలపాటు పనిచేసేందుకు 4.20 లక్షల పౌండ్లతో చెరీ బ్లెయిర్ ఓ ఒప్పందం చేసుకుంది.

- అంతర్జాతీయంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నానని చెప్పుకొనే చెరీ.. నియంత పాలనలో ఉన్న మాల్దీవుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంతో పనిచేస్తున్నట్టు అప్పట్లో ప్రకటించారు.

- కానీ నియంత యమీన్‌కు అనుకూలంగా వ్యవహరించినందుకు ఆమె కంపెనీకి అక్రమమార్గంలో ఏకంగా 2.10 లక్షల పౌండ్లు ముట్టాయి. వీటిని ఆయుధ సరఫరా వ్యాపారి, ఉగ్రవాది, ఇంటర్ పోల్ మోస్ట్ వాంటెడ్ నేరగాడు మహమెద్ ఆలం లతీఫ్ ఆమె కంపెనీ ఖాతాలో జమచేయడం గమనార్హం.

మల్దీవులు అధ్యక్షుడిగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన మహమ్మద్ నౌషధ్‌ను సైనిక చర్య ద్వారా అబ్దుల్లా యమీన్ గద్దె దించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కోర్టు విచారణలో న్యాయసహాయం కోసం చెరీ బ్లెయిర్ లీగల్ కంపెనీ 'ఒమ్నియా స్ట్రాటెజీ'ని అబ్దుల్లా యమీన్‌ గత ఏడాది వేసవిలో నియమించుకున్నారు. అయితే ఈ సంస్థ మానవ హక్కులకు సంబంధించి న్యాయసహాయం కోసం కాకుండా అంతర్జాతీయ మీడియా ముందు నియంత ప్రభుత్వాన్ని సమర్థించడానికి, అంతర్జాతీయ దౌత్య సంబంధాలు మెరుగుపరచడానికి లోపాయికారి సహకారం అందించిందనే ఆరోపణలు వినవస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement