బంగ్లాదేశ్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులు, రాజకీయ అస్థిరతపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. ప్రస్తుత బంగ్లాదేశ్ పరిణామాలు.. ఆ దేశానికే కాకుండా, ప్రతి నియంతకు ఒక హెచ్చరిక సందేశంగా పేర్కొన్నారు. ఈ మేరకు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత మాట్లాడుతూ.. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడం, దేశం విడిచి పారిపోవడం.. ప్రతి నియంతకు ఓ గుణపాఠమని పేర్కొన్నారు.
ప్రజల ఓపిక నశించినప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని అన్నారు. నియంతృత్వం ఎప్పటికైనా ప్రజల అసంతృప్తతి, ఆగ్రహానికి కారణమవుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా షేక్ హసీనా నిలబడలేదని, అందుకే ఆమె ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీయాల్సి వచ్చిందనిన్నారు.
‘బంగ్లాదేశ్‌లో తీవ్రమైన అనిశ్చితి నెలకొంది. వారి ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఆ దేశంలో అంతర్గత పరిస్థితి కూడా బాగా లేదు. అందుకే అక్కడ రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా విద్యార్థులు లేవనెత్తిన ఉద్యమాన్ని అణచివేయడం అక్కడి సైన్యానికి గానీ, ఇంకెవరికీ గానీ సాధ్యం కాలేదు. కాబట్టి ఇది ఒక గుణ పాఠం. బంగ్లాదేశ్‌కు మాత్రమే కాదు. ప్రజల ఆగ్రహానికి గురైన ప్రతి నియంత దీనిని నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రజల ఓపిక నశించే సమయం వస్తే ఇలాగే జరుగుతుంది’ అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాపై నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఆదివారం జరిగిన అల్లర్లలో 100 మందికి పైగా మరణించగా.. మొత్తంగా 300 మంది మృతి చెందారు. నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి సోమవారం రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లిన విషయం తెలిసిందే.
హసీనా రాజీనామాతో నిరసనకారులు చెలరేగిపోయారు. ప్రధాని ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. పలు వస్తువులను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. హసీనా తండ్రి, మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూల్చేశారు. బంగ్లాదేశ్ పార్లమెంటులోనూ విధ్వంసానికి పాల్పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment