దక్షిణ అమెరికా ఖండంలోని ఈక్వెడార్ సమీపంలో ఓ ద్వీపంలో నివసిస్తున్న నిత్యానంద స్వామి భారతదేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభించడంపై ఆయన స్పందిస్తూ భారత భూభాగంలో తాను అడుగుపెడితే ఆ వైరస్ ఇక అంతమవుతుందని ప్రకటించారు. ఈ విషయాన్ని తన శిష్యులతో మాట్లాడినట్లు తెలిసింది. కరోనా పోవాలంటే తాను భారత్‌లో అడుగుపెట్టాలని శిష్యులకు చెప్పాడు.
‘కైలాస’ అని తనకు తాను ఓ దేశాన్ని రూపొందించుకుని అక్కడే ఉంటున్న నిత్యానంద తరచూ భారతదేశానికి సంబంధించిన అంశాలపై స్పందిస్తున్నాడు. తాజాగా భారత్‌లో కరోనా విజృంభణపై స్పందించాడు. భారత్‌ను కరోనా ఎప్పుడు విడిచిపోతుందని ఓ శిష్యుడు అడిగిన ప్రశ్నకు ‘నేను భారత భూభాగంపై ఎప్పుడు అడుగు పెడతానో అప్పుడే కరోనా అంతం అవుతుంది’ అని నిత్యానంద తెలిపారు. నిత్యానంద స్వామి లైంగిక వేధింపుల కేసుల్లో ఇరుక్కున్నాడు. అనంతరం 2019లో గుట్టుచప్పుడు కాకుండా భారత్‌ను విడిచి పారిపోయాడు.
అనంతరం ఈక్వెడార్ సమీపంలో ఓ చిన్న దీవిని కొనుగోలు చేసుకుని దానికి ‘కైలాస’ అని పేరు పెట్టుకున్నాడు. రాజకీయాలు లేకుండా హిందూ దేశంగా రూపొందించినట్లు నిత్యానంద తెలిపారు. ఆ దేశానికి ప్రత్యేక జెండా, పాస్‌పోర్టు, జాతీయ చిహ్నం రూపొందించుకున్నాడు. రిజర్వ్ బ్యాంక్ కూడా ఏర్పాటుచేసుకున్నాడు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కొన్ని దేశాల రాకపోకలపై నిషేధం విధించాడు. తన దేశాన్ని గుర్తించాలని ఐక్యరాజ్యసమితికి లేఖ కూడా రాశాడు.
Comments
Please login to add a commentAdd a comment