మాస్కో: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడంపై రష్యా తనదైన శైలిలో స్పందించింది. అమెరికాతో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారని పేర్కొంది. మున్ముందు రెండు దేశాల మధ్య సంబంధాలు అమెరికా యంత్రాంగం వైఖరిపైనే ఆధారపడి ఉంటాయని వ్యాఖ్యానించింది.
అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌ను పుతిన్ అభినందించకుంటే రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తాయా అన్న ప్రశ్నకు అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ఈ మేరకు స్పందించారని ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ వెల్లడించింది. ‘అమెరికా, రష్యాల మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంత తీవ్రస్థాయికి దిగజారాయి. ఇంతకంటే క్షీణించడం అసాధ్యం. ట్రంప్ బాధ్యతలు చేపట్టాక అమెరికా వైఖరిలో మార్పు వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
న్యాయం, సమానత్వం, పరస్పర గౌరవం, ఆధారంగా నిర్మాణాత్మక సంభాషణకు తాను సిద్ధమని అధ్యక్షుడు పుతిన్ పదేపదే చెప్పారు. ఆయన ఇదే వైఖరికి కట్టుబడి ఉన్నారు. అమెరికా మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. వేచిచూద్దాం, జనవరిలో ఏం జరుగుతుందో..’అని పెషో్కవ్ అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై పుతిన్ స్పందించకపోవడంపై తానేమీ చెప్పలేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment