![Woman Feels Too Hot and Walks Onto Airplane Wing - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/2/ukraine.jpg.webp?itok=mgijic3g)
కీవ్: సాధారణంగా అప్పుడప్పుడు జనాలు చేసే తలతిక్క పనులు చూస్తే.. చిరాకొస్తుంది. ఏమని తిట్టాలో కూడా అర్థం కాదు. తమ తింగరి వేషాలతో చుట్టూ ఉన్నవారితో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడుతుంటారు. తాజాగా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్న వారి జాబితాలోకి చేరారు ఉక్రెయిన్ విమానాశ్రయ అధికారులు. ఓ ప్రయాణికురాలు విమానంలో చాలా వేడిగా ఉందని చెప్పి.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరిచి విమానం రెక్క మీద నడుస్తూ.. భయాందోళనలు సృష్టించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కీవ్‌లోని బోరిస్‌పిల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. టర్కీ నుంచి వచ్చిన బోయింగ్ 737-86ఎన్ విమానంలో సదరు మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చింది. ఈ క్రమంలో బోరిస్‌పిల్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అయ్యింది. (చదవండి: ‘సీటు బెల్టు తీసి.. కిందకు దూకేశా’)
ప్రయాణికులు ఒక్కొక్కరే దిగుతున్నారు. ఇంతలో ఆ మహిళ తన పిల్లలను లోపలే వదిలి.. వెళ్లి ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ని తెరిచి నడుచుకుంటూ బయటకు వెళ్లింది. సదరు మహిళ చర్యకు ఆమె పిల్లలతో పాటు ప్రయాణికులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ‘చాలా వేడిగా ఉంది’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడయాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిపై విమానాశ్రయ అధికారులు స్పందించారు. సదరు మహిళను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చమన్నారు. అంతేకాక ఆమె ఎందుకు ఇలా చేసిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆ సమయంలో ఆమె మత్తులో కూడా లేదు. విమానంలో తనకు చాలా వేడిగా ఉందని అందుకే ఇలా చేశానని తెలిపింది అన్నారు అధికారులు. ఈ వీడియో చూసిన నెటిజనులు ఆమెపై మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment