కాబోయే కోడలు కన్నకూతురని తెలిసింది.. ట్విస్ట్‌ ఏంటంటే | Woman Finds Out Son Bride Is Her Long Lost Daughter on Their Wedding Day | Sakshi
Sakshi News home page

కాబోయే కోడలు కన్నకూతురని తెలిసింది.. ట్విస్ట్‌ ఏంటంటే

Published Tue, Apr 6 2021 3:14 PM | Last Updated on Tue, Apr 6 2021 3:58 PM

Woman Finds Out Son Bride Is Her Long Lost Daughter on Their Wedding Day - Sakshi

బీజింగ్‌: చైనాలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. గంటలో కొడుకు పెళ్లి.. అంతా కోలాహాలంగా ఉంది. ఇంతలో పెళ్లి కుమారుడి తల్లి.. కాబోయే కోడలిని పరీక్షగా చూసింది. ఆమె చేతి మీద కనిపించిన పుట్టు మచ్చ చూసి ఆ తల్లి షాకయ్యింది. ఎందుకు అంటే తనకు కోడలు కాబోయే ఆ అమ్మాయి.. పాతికేళ్ల క్రితం తప్పిపోయిన తన కుమార్తెగా ఆ తల్లి గుర్తించింది. ట్విస్ట్‌ ఏంటంటే.. వివాహం ఆగిపోలేదు. ఎందుకో తెలియాలంటే.. ఇది చదవాల్సిందే. ఈ సంఘటన గత నెల 31న జియాంగ్సు ప్రావిన్స్‌లోని సుజౌ ప్రాంతంలో చోటు చేసుకుంది. పెళ్లికి మరి కొద్ది సమయం ఉందనగా.. కాబోయే అత్తగారికి వధువు చేతి మీద ఉన్న పుట్టుమచ్చ కనిపించింది. అది చూడగానే ఆమెకు గతం గుర్తుకు వచ్చింది. దాదాపు 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన కుమార్తె చేతి మీద కూడా ఇలాంటి మచ్చే ఉండేది. దాంతో అనుమానం వచ్చిన తల్లి.. వధువు తల్లిదండ్రుల దగ్గరకి వెళ్లి పెళ్లి కుమార్తె గురించి ప్రశ్నించింది. 

దాంతో వధువు తల్లిదండ్రులు ముందు కాస్త ఆలోచించారు. ఆ తర్వాత 20 ఏళ్లుగా తమ కడుపులో దాచుకున్న రహస్యాన్ని వెల్లడించారు. వధువు తల్లిదండ్రులు చెప్పిన ఆ రహస్యం అక్కడున్న వారిని షాక్‌కు గురి చేసింది. ఇంతకు వారు చెప్పిన ఆ సీక్రెట్‌ ఏంటంటే.. పిల్లలు లేని ఆ దంపతులకు 20 ఏళ్ల క్రితం ఓ చిన్నారి దొరికింది. దాంతో ఆ పాపను వారితో పాటు తీసుకువచ్చి.. పెంచి పెద్దచేసి విద్యాబుద్ధులు నేర్పించారు. మంచి అబ్బాయిని చూసి పెళ్లి నిశ్చయించారు. తాము అనుకున్నట్లు జరిగితే మరొక గంటలో వారి పెంపుడు కుమార్తె వివాహం పూర్తయ్యేది. కానీ వధువు చేతి మీద ఉన్న పుట్టుమచ్చిన చూసిన అత్తగారు.. తనకు కోడలు కాబోతున్న అమ్మాయి ఒకప్పుడు తప్పిపోయిన తన కుమార్తెగా గుర్తించారు. 

20 ఏళ్ల తర్వాత కన్నతల్లి చూసిన ఆ అమ్మాయి కన్నీళ్లపర్యంతం అయ్యింది. ఆ దృశ్యం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కదిలించింది. అయితే ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. ముందు అనుకున్న ప్రకారమే వారి వివాహం జరిగింది. ఇదేంటి అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకోవడం ఏంటనుకుంటున్నారా.. ఎందుకంటే.. కుమార్తె తప్పిపోయిన తర్వాత సదరు మహిళ ఓ అబ్బాయిని దత్తత తీసుకుంది. అతడే ఈ పెళ్లి కుమారుడు. ఈ సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ.. ‘‘నా కుమార్తె, పెంపుడు కుమారుడి వివాహం విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే వారిద్దరూ రక్తం పంచుకుపుట్టిన వారు కాదు. కనుక వారి వివాహం నాకు ఆమోదమే’’ అని తెలిపింది. ఆ తర్వాత యథావిధిగా వారి వివాహ తంతు పూర్తయ్యింది. ఇక పెళ్లి వేడుకకు వచ్చిన వారు ఈ వింత సంఘటనకు తొలుత ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వారు నూతన దంపతులు నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆశీర్వదించారు.

చదవండి: కరోనా వ్యాప్తికి ‘గే పెళ్లిళ్లు’ కారణమంట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement