ప్రిటోరియా: తనకు ఒకే కాన్పులో 10 మంది పిల్లలు( డెక్యూప్లెట్స్) జన్మించినట్లు దక్షిణాఫ్రికాకు చెందిన గొసియామీ థామర సిట్‌హోల్ (37) అనే మహిళ ప్రకటించింది. ప్రిటోరియా నగరంలో సోమవారం రాత్రి తన భార్యకు సిజేరియన్ (సి–సెక్షన్) ద్వారా ప్రసవం జరిగిందని, ఏడుగురు మగ శిశువులు, ముగ్గురు ఆడ శిశువులు జన్మించారని ఆమె భర్త టెబోగో సోటెట్సీ చెప్పారు. తనకు చాలా ఆనందంగా ఉందని, ప్రస్తుతం ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనంటూ భావోద్వేగానికి గురయ్యారు.
తన భార్య గర్భం దాల్చి 7 నెలల 7 రోజులయ్యిందని, నెలలు నిండకుండానే 10 మందికి జన్మనిచ్చిందని తెలిపాడు. అయితే, ఒకే కాన్పులో 10 జన్మించారని దంపతులు చెబుతున్న విషయాన్ని వైద్యులు ఇంకా ధ్రువీకరించలేదు. ఒకవేళ ధ్రువీకరిస్తే.. ఒకే కాన్పులో ఇంతమంది పిల్లలు పుట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అవుతుంది. గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కడం ఖాయం. సిట్‌హోల్ గతంలో కవలలకు జన్మనిచ్చింది. రెండోసారి సహజ గర్భం దాల్చానని సిట్‌గోల్ గతంలో వెల్లడించింది.
కృత్రిమ గర్భధారణ కోసం చేసే ట్రీట్‌మెంట్ల వల్లే ఇలా ఎక్కువ మంది శిశుశులు జన్మిస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు. గర్భం దాల్చే అవకాశాలను పెంచడానికి ఫలదీకరణ చెందిన అండాలను ఎక్కువ మొత్తంలో మహిళల గర్భాశయంలో ప్రవేశపెడుతుంటారని, అవి సక్రమంగా పెరిగి, ఎక్కువ మంది శిశువులు జన్మిస్తారని అంటున్నారు. ప్రసవం కంటే ముందు కూడా ఆమె మీడియాతో మాట్లాడింది. తన గర్భంలో ఆరుగురు శిశువులు ఉన్నట్లు వైద్యులు చెప్పారని, తర్వాత స్కానింగ్ చేయిస్తే 8 మంది ఉన్నట్లు తేలిందని వివరించింది. ప్రసవంలో ఆ సంఖ్య 10కి చేరింది. ఈ పిల్లల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్నది ఇంకా తెలియరాలేదు.
చదవండి: 24 వేల ఏళ్ల తర్వాత బతికొచ్చాయి!
Comments
Please login to add a commentAdd a comment