వాషింగ్టన్: తొందరపాటుతో అప్పుడప్పుడు మనం చేసే పనులకు జీవితకాలం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. తాజాగా అమెరికాకు చెందిన ఓ మహిళకు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఐ డ్రాప్స్ అనుకుని పొరపాటుగా కంట్లో జిగురు వేసుకుంది. శాశ్వతంగా చూపు కోల్పోయే పరిస్థితి కానీ అదృష్టం కొద్ది ఆ ప్రమాదం నుంచి బయటపడగలిగింది. ఆ వివరాలు.. మిచిగన్‌కు చెందిన యాసిడ్రా విలియమ్స్ కాంటక్ట్ లెన్స్ వినియోగిస్తుంది.
ప్రతి రోజు రాత్రి నిద్ర పోయే ముందు వాటిని తొలగించి.. పడుకుంటుంది. అయితే పది రోజుల క్రితం ఆమె కాంటాక్ట్ లెన్స్ తీయకుండానే నిద్ర పోయింది. దాంతో అర్థరాత్రి సమయంలో కళ్లలో మంటగా అనిపించింది. దాంతో తన హ్యాండ్‌బాగ్‌లో ఉండే ఐడ్రాప్ బాటిల్ తీసుకుందామని దానిలో చేయి పెట్టింది. చేతికి దొరికిన డబ్బా తీసుకుని.. కంట్లో రెండు చుక్కలు వేసుకుంది.
అయితే ఐడ్రాప్స్ వేసుకున్న తర్వాత విశ్రాంతిగా ఉండాల్సింది పోయి.. ఆమె కళ్లలో దురద, మంట పెరగసాగాయి. దాంతో ఆమె కళ్లు మూసుకుని వాటిని రుద్దసాగింది. ఆ తర్వాత చల్లని నీటితో కంటిని శుభ్రం చేసుకుందామని భావించి కళ్లు తెరవడానికి ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. అప్పుడు కానీ ఆమెకు తాను చేసిన తప్పిదం తెలియలేదు.
సాధారణంగా యాసిడ్రా విలియమ్స్ తన హ్యాండ్ బాగ్‌లో ఐడ్రాప్స్ బాటిల్‌తో పాటు నెయిల్ గ్లూ(గోళ్లు విరిగితే అతుకుపెట్టుకోవడానికి వాడతారు) డబ్బాలను రెండింటిని తనతో తీసుకెళ్తుంది. ఇవి రెండు ఒకే పరిమాణంలో ఉంటాయి. దాంతో ఆమె కళ్లు దురద అనిపించిన వెంటనే హ్యాండ్‌బ్యాగ్‌లో చేయి పెట్టి చేతికి దొరికిన డబ్బా తీసుకుంది. లైట్ వేసి అదేంటో చెక్ చేయలేదు. అలా పొరపాటున ఐ డ్రాప్స్‌కు బదులుగా నెయిల్ గ్లూ కళ్లలో వేసుకుంది.
ఇక యాసిడ్రా విలియమ్స్ అరుపులు విన్న కుటుంబ సభ్యులు వెంటనే పరిగెత్తుకు వచ్చి.. విషయం తెలుసుకుని ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేశారు. వైద్యులు ఆమె కళ్లకు శస్త్ర చికిత్స చేసి.. కంట్లో పడిన గ్లూ శుభ్రం చేశారు. అతుక్కుపోయిన కాంటాక్ట్‌లెన్స్‌ని తీశారు. వీటి వల్లనే ఆమె చూపు కోల్పోకుండా బయటపడగలిగిందని తెలిపారు. కాకపోతే కనురెప్పలను పూర్తిగా తొలగించాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment