న్యూయార్క్ : ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా సరే కన్నతల్లి తన బిడ్డపై చూపించే ప్రేమ ఒకేలా ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా బిడ్డకు మాత్రం హాని తలపెట్టదు. తాను కష్టాలు ఎదుర్కొనైనా సరే బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కన్నతల్లి ప్రేమ అలాంటిది. కానీ ఇక్కడ ఒక కన్నతల్లి మాత్రం అప్పుడే పుట్టిన పసికందును కిటీకీలోంచి విసిరేసి మాతృత్వం అనే పదానికి కళంకం తెచ్చింది. ఈ హృదయవిదారక ఘటన అక్టోబర్ 10న అమెరికాలో న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. (చదవండి : రాక్షసి: గర్భిణిని చంపి, బిడ్డను తీసుకొని...)
వివరాలు ... న్యూయార్క్‌లోని క్వీన్స్ ఏరియాలో భారత సంతతికి చెందిన అమెరికా 23 ఏండ్ల యువతి సబితా దూక్రమ్ భర్తతో కలిసి నివసిస్తుంది. గర్భవతి అయిన సబితా దూక్రమ్ ఈనెల 10న బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా ప్రసవించింది. భయంతో ఏం చేయాలో తెలియక అప్పుడే పుట్టిన పసికందును బాత్రూం వెంటిలేటర్ నుంచి బయటికి విసిరేసింది. అనంతరం బాత్రూంను శుభ్రపర్చి స్నానం చేసి యధావిథిగా వచ్చి బెడ్‌పై పడుకుంది.అయితే పసికందు ఏడుపు శబ్ధం విన్న ఇరుగుపొరుగు వారు ఆ పసికందును ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రసవించిన విషయాన్ని కుటుంబసభ్యులు ఎవరికీ చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారని అడిగిన ప్రశ్నకు సబితా దూక్రమ్ చెప్పిన సమాధానం పోలీసులనే ఆశ్చర్యపరిచింది. అసలు ఈమె కన్నతల్లేనా అనే అనుమానం కూడా వస్తుంది. 'నేను బాత్రూం వెళ్లి స్నానం చేస్తుండగా బాబు పుట్టాడు. అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నాకు చాలా భయం వేసింది. బాత్రూంలో ఉన్న కత్తెరతో బొడ్డుతాడు కట్‌చేసి బాబును బయటికి విసిరేశా. ఆ తర్వాత నా దుస్తులను బాత్రూంలోని వాషింగ్‌మెషిన్‌లో పడేసి, బాత్రూంను శుభ్రంగా కడిగి బయటికి వచ్చి బెడ్రూంలో పడుకున్నా' అని చెప్పింది. అసలు సబితా దుక్రమ్ భయంతో నిజంగానే బిడ్డను పారేసిందా లేక మతిస్థిమితం తప్పి అలా ప్రవర్తించిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంలో సబితా దూక్రమ్‌ను కఠినంగా శిక్షించాలని అక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment