చైనాలో బంగారు పంట | World Largest Gold Deposit Found In China Worth Of $83 Billion In Hunan, Check Out For More Insights | Sakshi
Sakshi News home page

చైనాలో బంగారు పంట

Published Mon, Dec 2 2024 5:07 AM | Last Updated on Mon, Dec 2 2024 8:46 AM

World Largest Gold Deposit Found In China

1,000 టన్నుల నిల్వలు వెలుగులోకి 

విలువ రూ.7 లక్షల కోట్ల పైమాటే! 

బీజింగ్‌: చైనాలో అతి భారీ స్థాయిలో బంగారం నిల్వలు బయటపడ్డాయి. సెంట్రల్‌ హూనాన్‌ ప్రావిన్స్‌లో పింగ్‌జియాండ్‌ కౌంటీలోని వాంగూ గోల్డ్‌ ఫీల్డ్‌లో ఇటీవల తవ్వకాల్లో వీటిని గుర్తించారు. ఇక్కడ ఏకంగా 1,000 టన్నులకు (10 లక్షల కిలోలకు) పైగా పసిడి లోహం ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఒకేచోట ఈ స్థాయిలో నిల్వలను గుర్తించడం ప్రపంచంలో ఇదే తొలిసారి. 

భూ ఉపరితలం నుంచి 2 కి.మీ. దిగువన 300 టన్నులు, 3 కి.మీ. దిగువన 700 టన్నులు ఉన్నట్లు చెబుతున్నారు. దీని విలువ 80 బిలియన్‌ డాలర్ల (రూ.6.76 లక్షల కోట్లు) పైమాటే! సెంట్రల్‌ హునాన్‌ ప్రావిన్స్‌ను ప్రపంచంలోనే అత్యధిక బంగారం నిల్వలు ఉన్న ప్రాంతంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ప్రతి టన్ను మట్టిలో 8 గ్రాముల బంగారముంటేనే దాన్ని హెచ్చు నాణ్యత కలిగిన ముడి ఖనిజంగా పరిగణిస్తారు. అలాంటిది హునాన్‌లో టన్ను మట్టిలో ఏకంగా 138 గ్రాముల చొప్పున స్వచ్ఛమైన స్వర్ణం ఉందని తేల్చారు. 

అంటే అత్యధిక నాణ్యత కలిగిన ముడి ఖనిజమని పేర్కొంటున్నారు. కళ్లు చెదిరే రీతిలో బంగారం నిల్వలు బయటపడడంతో చైనా గోల్డ్‌ పరిశ్రమకు మరింత ప్రోత్సాహం లభించనుంది. ప్రపంచ గోల్డ్‌ మార్కెట్‌ను డ్రాగన్‌ దేశం శాసించే రోజులు రాబోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బంగారం ఉత్పత్తిలో చైనా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచమంతటా ఏటా ఉత్పత్తయ్యే బంగారంలో చైనా వాటా 10 శాతం. ఇకపై అది మరింత పెరుగబోతోంది. రోజురోజుకూ పసిడి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చైనా భారీగా లబ్ధి పొందనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement