2024 ముగియడానికి ఇక కొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇంతలోనే కజకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 38 మంది ప్రయాణికులు మృతిచెందారు. ఈ ఏడాది అధికంగానే విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
జపాన్ విమాన ప్రమాదం
2024 జనవరి 2న జపాన్‌లోని టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో జపాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 516- జపాన్ కోస్ట్ గార్డ్ విమానం పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 367 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సురక్షితంగానే ఉన్నారు. అయితే కోస్ట్ గార్డ్ విమానంలోని ఆరుగురు సభ్యులలో ఐదుగురు మృతిచెందారు.
బెల్గోరోడ్ ఓబ్లాస్ట్ విమాన ప్రమాదం
2024, జనవరి 24న బెల్గోరోడ్ ఒబ్లాస్ట్‌లో రష్యన్ వైమానిక దళానికి చెందిన ఇల్యుషిన్ ఐఎల్ 76 సైనిక రవాణా విమానం కూలిపోయింది. ఈ విమానంలో 65 మంది ఉక్రేనియన్ యుద్ధ ఖైదీలతో పాటు తొమ్మిదిమంది సిబ్బంది ఉన్నారు. వీరంతా మృతిచెందారు.
రష్యా విమాన ప్రమాదం
2024, మార్చి 12న రష్యాలోని ఇవానోవో ఒబ్లాస్ట్‌లో ఇల్యుషిన్ ఐఎల్76 కార్గో విమానం కూలిపోయింది. దీంతో ఆ విమానంలోని మొత్తం 15 మంది మృతిచెందారు.
ఇరాన్ విమాన ప్రమాదం
2024, మే 19న ఇరాన్‌లోని తూర్పు అజర్‌బైజాన్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో సహా మొత్తం తొమ్మిది మంది మృతిచెందారు.
మలావి విమాన ప్రమాదం
2024, జూన్ 10న మలావీ వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ చిలిమా, ఇతర ప్రముఖులతో ప్రయాణిస్తున్న మలావీ డిఫెన్స్ ఫోర్స్ డోర్నియర్- 228 విమానం కూలిపోవడంతో అందులోని తొమ్మిది మంది మృతిచెందారు.
నేపాల్ విమాన ప్రమాదం
2024, జూలై 24న నేపాల్‌లోని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన సౌర్య ఎయిర్‌లైన్స్ విమానం కొద్దిసేపటికే కుప్పకూలింది. అందులో ఉన్న 19 మందిలో 18 మంది మృతిచెందారు.
విన్‌హాడో విమాన ప్రమాదం
2024, ఆగస్ట్ 9న బ్రెజిల్‌లోని సావోపాలోలోని విన్‌హెడోలో ఫ్లైట్- 2283 క్రాష్ అయ్యింది. అందులో మొత్తం 62 మంది ప్రయాణికులు మృతిచెందారు. ఇది బ్రెజిల్‌లో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది.
బ్రెజిల్ విమాన ప్రమాదం
2024, డిసెంబర్ 22న బ్రెజిల్‌లోని కెనెలా విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైపర్ పీఏ42 చెయెన్నే విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది ప్రయాణికులు మృతిచెందారు. 17 మంది గాయపడ్డారు.
కజకిస్తాన్ విమాన ప్రమాదం
2024, డిసెంబర్ 25న అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ కజకిస్తాన్‌లోని అక్టౌ సమీపంలో కూలిపోయింది. క్రిస్మస్ రోజున జరిగిన ఈ విమాన ప్రమాదంలో 38 మంది మృతి చెందగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Year Ender 2024: దుమ్మురేపిన 100 మంది డిజిటల్ స్టార్స్..
Comments
Please login to add a commentAdd a comment