హాంకాంగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హింసను ప్రేరేపించేలా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ ఉండడంతో యూ ట్యూబ్ కూడా ఆయన చానెల్‌ని వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. ట్రంప్ తాజాగా పోస్టు చేసిన వీడియో తమ నిబంధనలకి వ్యతిరేకంగా ఉందని యూ ట్యూబ్ బుధవారం ట్వీట్ చేసింది. అయితే ఆ వీడియో ఏమిటన్నది స్పష్టంగా వెల్లడించలేదు. ‘‘డొనాల్డ్ ట్రంప్ యూట్యూబ్ చానెల్‌లో హింసను ప్రేరేపించేలా వీడియోలు పోస్టు అవుతున్నాయని మాకు ఫిర్యాదులు అందాయి. ఆయన చానెల్‌లో కొన్ని వీడియోలను తొలగించాం. మొదటి హెచ్చరికగా వారం రోజులు నిషేధిస్తున్నాం’’అని ట్వీట్ చేసింది. యూట్యూబ్ నిబంధనల ప్రకారం మళ్లీ ఇలాంటి వీడియోలు పోస్టు చేస్తే రెండు వారాలు నిషేధం విధిస్తారు. మూడోసారి అదే తప్పు చేస్తే శాశ్వతంగా చానెల్‌ని తొలగిస్తారు.
రాజ్యాంగాన్ని కాపాడదాం: మిలటరీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అనుచరులు హింసాత్మక ఘటనలకు పాల్పడతారని ఆందోళనలు నెలకొన్న వేళ మిలటరీ అప్రమత్తమైంది. అమెరికా రాజ్యాంగాన్ని కాపాడడమే తమ బాధ్యతంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. దేశ రక్షణలో ఉన్న ప్రతీ ఒక్కరిపైనా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ఉందంటూ మంగళవారం మిలటరీలో అత్యున్నత స్థాయి నాయకులు ఒక సంయుక్త ప్రకటన జారీ చేశారు. అమెరికా ఆర్మీ ఇలా పిలుపునివ్వడం అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుంది. అమెరికా మిలటరీ సీనియర్ జనరల్ మార్క్ మిల్లే, అన్ని బలగాల జాయింట్ ఛీప్స్ ఆఫ్ స్టాఫ్ ఈ ప్రకటనపై సంతకాలు చేశారు. ‘‘అమెరికా మిలటరీ ఎల్లప్పుడూ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలను, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుతుంది. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే ఆదేశాలను తప్పక పాటిస్తాం. ఇంటా, బయటా శత్రువుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడడానికి మేము కట్టుబడి ఉన్నాం’’అని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ట్రంప్ యూట్యూబ్ చానెల్ నిలిపివేత
Published Thu, Jan 14 2021 4:34 AM | Last Updated on Thu, Jan 14 2021 1:23 PM
Comments
Please login to add a commentAdd a comment