ధర్మపురి(బుగ్గారం): ‘పుట్టుకతోనే కొడుకును కోల్పోయిన.. రోడ్డు ప్రమాదంలో కూతురు చనిపోయింది.. వారి మరణాన్ని తట్టుకోలేని నా భర్త మనస్తాపంలో మంచం పట్టిండు.. ఆ తర్వాత ఆయనా పోయిండు.. నాకు తోడుగా ఉండే నా తల్లి కూడా చనిపోయింది.. ఇక నేనెవరి కోసం బతకాలి’ అని తీవ్రంగా మదనపడిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బుగ్గారం మండల కేంద్రానికి చెందిన పన్నాటి సుమలత(38)కు జిల్లాలోని మల్యాల మండల కేంద్రానికి చెందిన గంగాధర్‌తో 2014లో వివాహమైంది.
ఈ దంపతులకు కొడుకు పుట్టగానే చనిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి కూతురు జన్మించింది. కొన్నేళ్లక్రితం ఆ బాలిక రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఇద్దరు పిల్ల లు మృతి చెందారనే మనస్తాపానికి గురైన గంగాధర్.. అనంతరం అనారోగ్యం బారిన పడ్డాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే అతడూ మరణించాడు. దిక్కుమొక్కులేని సుమలత.. పుట్టింటికి చేరుకుంది. కొన్నిరోజులుగా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది.
అయితే, ఆమె తల్లి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందింది. నా అనుకున్న వారంతా ఒక్కొక్కరుగా చనిపోతుండడంతో తట్టుకోలేని సుమలత .. తీవ్ర మనస్థాపనకు గురైంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. తండ్రి లక్ష్మీరాజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment