జగిత్యాల: రెండ్రోజుల క్రితం పట్టణ శివారులోని డీ–40 కాలువలో అనుమానాస్పదంగా మృతిచెందిన షేక్ సమీర్ (22) హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఆదివారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ప్రవీణ్ కుమార్ నిందితుల వివరాలు వెల్లడించారు. పట్టణంలోని బీముని దుబ్బలో నివసిస్తున్న షేక్ సమీర్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అంబేద్కర్ నగర్‌కు చెందిన కండ్లె ఈశ్వర్ (23), నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తన స్నేహితుడు ఉట్నూర్ బాలా శంకర్ ఈనెల 2న రాత్రి సమీర్‌ను డి–40 కాలువ వద్దకు పిలిపించుకొని ముగ్గురు మద్యం తాగారు.
ఈ క్రమంలో కండ్లె ఈశ్వర్, సమీర్ గొడవపడగా అప్పటికే పథకం ప్రకారం తమతో తెచ్చుకున్న నైలాన్ తాడును ఉట్నూర్ బాలా శంకర్, ఈశ్వర్‌లు సమీర్ మెడకు చుట్టి హత్యచేశారు. మృతదేహంతో పాటు ద్విచక్రవాహనాన్ని కాలువలో పడేశారు. రెండ్రోజుల క్రితం డీ–40 కాలువలో సమీర్ మృతదేహం లభ్యంకాగా మృతుడి బావ అమీర్ కండ్లె ఈశ్వర్‌పై అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కల్లూర్ రోడ్డులో ఈశ్వర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా తన భార్యతో సమీర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతోనే హత్యచేసినట్లు ఒప్పుకున్నాడు.
అందుకు తన స్నేహితుడు బాలా శంకర్ సాయం తీసుకున్నాడని, రూ.40 వేలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈశ్వర్ తెలిపాడని సీఐ వెల్లడించారు. నిందితుల వద్ద రెండు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలు, హత్యకు ఉపయోగించిన నైలాన్ తాడును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్లు చెప్పారు. ఎస్సై కిరణ్ కుమార్, కానిస్టేబుళ్లను సీఐ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment