హైదరాబాద్: సంచలనం సృష్టించిన కన్నం సతీశ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రవీందర్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఇందిరానగర్‌కు చెందిన కన్నం సతీశ్ ఈనెల 20న రాత్రి 10.58 గంటల సమయంలో తన స్నేహితుడు నిఖిల్‌తో కలిసి పట్టణ శివారులోని శక్తి బార్ వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న శివాజీనగర్‌కు చెందిన జక్కం రాజేశ్.. సతీశ్‌తో మాటలు కలిపాడు. బార్ సమీపంలోని సందిలోకి తీసుకెళ్లాడు.
కొద్దిదూరం వెళ్లాక సతీశ్ తలపై రాజేశ్‌తోపాటు పాతర్ల నవీన్ కర్రలతో దాడి చేశారు. అక్కడే ఉన్న నేరవేణి రమేశ్ ఇటుకతో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన సతీశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. 2015లో రాజేశ్, సతీశ్ మధ్య ఓ విషయంలో వివాదం తలెత్తింది. ఈక్రమంలో సతీశ్.. రాజేశ్‌పై దాడిచేశాడు. కొద్దిరోజుల తర్వాత ఇద్దరి మధ్య రాజీకుదిరింది. ఆ తర్వాత వీరి మధ్య పలుమార్లు ఘర్షణలు జరిగాయి. వీటిని దృష్టిలో ఉంచుకొనే సతీశ్‌ను హతమార్చారు. దాడిలో పాల్గొన్న ముగ్గురు పారిపోయేందుకు, డబ్బులు సమకూర్చే తదితర విషయాల్లో మెట్‌పల్లికి చెందిన తాటికొండ రామకృష్ణ, గుండు గోపాల్, మిట్టపల్లి రాంమోహన్, కోరుట్లకు చెందిన చింతకింది హరీశ్ సహకరించారు.
హత్యలో ముగ్గురు పాలుపంచుకోగా, వారికి సహకరించిన నలుగురిని మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట వద్ద పోలీసులు పట్టుకున్నారు. వీరిపై 302, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలు, ఏడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురి రికార్డు పరిశీలించాక నేరచరిత్ర ఉంటే పీడీ యాక్ట్ నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తామని డీఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో మెట్‌పల్లి సీఐ లక్ష్మీనారాయణ, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ ఎస్‌ఐలు ఉమాసాగర్, నవీన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment