‘సాయి... నేను, దీప్తి అక్క మద్యం తాగాలని అనుకున్నం.. కానీ నేను తాగలేదు.. అక్కనే తాగింది.. నేను నా ఫ్రెండ్‌తో తెప్పించా.. అది ఒప్పుకుంటా.. ఇంకా అక్కవాళ్ల బాయ్‌ఫ్రెండ్‌ను పిలుస్తా అంటే నేను వద్దన్నా.. అయినా పిలుస్తా అంది.. సరే లే నీ ఇష్టం అన్నా.. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోదామనుకున్నా.. నిజమే.. అది నేను ఒప్పుకుంటా.. అక్కకు చెప్పి వెళదామనుకున్నా.. కానీ.. అప్పటికే అక్క హాఫ్ బాటిల్ వోడ్కా కంప్లీట్ చేసింది.. అంతకుముందే ఫోన్‌లో మాట్లాడింది.. తర్వాత సోఫాలోకి వెళ్లి పడుకుంది.. నేను లేపితే లేవలేదు.. పడుకుంది కదా.. అని డిస్టర్బ్ చేయలేదు.. చాన్స్ దొరికింది కదా అని.. నేనే ఇంట్లో నుంచి వెళ్లిపోయా.. నా తప్పేం లేదు.. నాకు అక్కను చంపే ఉద్దేశమే లేదు.. ఇలా అవుతుందని అనుకోలేదు.. అక్కను నేనెందుకు చంపుతా.. నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇంట్లో నుంచి తీసుకెళ్లా’
– తన తమ్ముడు సాయి మొబైల్‌కి చందన పంపిన వాయిస్ మెసేజ్ ఇది..
జగిత్యాల: చందన తాను అక్కను చంపలేదని తమ్ముడు సాయికి వాయిస్ మేసేజ్ పంపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మెసేజ్ ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు. కోరుట్ల బస్టాండ్‌లో మంగళవారం ఉదయం కనిపించిన సీసీ ఫుటేజీ చిత్రాలు.. చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్‌వి కావనే సమాచారంతో విచారణ గందరగోళంగా మారింది. అయితే, చందన బాయ్ ఫ్రెండ్ కారులో వచ్చి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చందన ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు మరోసారి పరిశీలిస్తున్నారు. ఆమె వాయిస్ మేసేజ్ వచ్చిన సెల్‌ఫోన్ ఆధారంగా రెండు బృందాలు హైదరాబాద్‌కు చేరుకుని గాలింపు చేపట్టాయి.
దీప్తి ఒంటిపై గాయాలు..!?
► అనుమానాస్పదంగా మృతి చెందిన దీప్తి ఒంటిపై స్వల్పగాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలినట్లు సమాచారం.
► దీప్తి టీషర్ట్ కింద శరీరం కాస్త కమిలిన గాయాలు, చెంపపై గీసుకుపోయినట్లుగా ఓ చిన్నగాయం ఉన్నట్లు తెలిసింది.
► దీంతోపాటు దీప్తి చేతులు కట్టేసినట్లుగా మణికట్టు వద్ద గాయం ఉన్నట్లు సమాచారం.
► ఒకవేళ చేయి విరిగి ఉంటే బంక దీప్తి హత్యకు గురైందన్న అంశానికి మరింత బలం చేకూరుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతాయి.
► సాధారణంగా పోస్టుమార్టం నివేదికకు సంబంధించిన షార్ట్ రిపోర్టు అదే రోజు అందించే ఆనవాయితీ ఉన్నా.. వైద్యులు ఈ విషయంలో కుదరదని చెప్పినట్లు తెలిసింది.
డబ్బులు, నగలు మాయం
బంక శ్రీనివాస్‌రెడ్డి(దీప్తి తండ్రి) ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, సుమారు 50 తులాల వరకు బంగారు ఆభరణాలు మాయమైనట్లు సమాచారం. ఇంట్లోనుంచి వెళ్లిపోయిన చందన.. డబ్బులు తాను తీసుకున్నట్లు వాయిస్ మేసేజ్‌లో చెప్పినా.. బంగారం విషయం ఎత్తలేదు. బంగారం సైతం చందన తీసుకెళ్లి ఉంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చందన తన క్లాస్‌మేట్ ఒకరితో కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉంటోందని, అతడితో కలిసి డబ్బులు, నగలు తీసుకు వెళ్లి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
దారి మళ్లిస్తున్నారా?
చందన తమ్మునికి పంపిన వాయిస్ మేసేజ్‌లో దీప్తి తన బాయ్‌ఫ్రెండ్‌కు పోన్ చేసి ఇంటికి రమ్మంటానని చెప్పిందని, తాను వద్దన్నానని చెప్పిన తీరు సంఘటనను దారి మళ్లించేందుకేనా? అనే అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. వాయిస్ మేసేజ్‌తో ఇంట్లో నుంచి చందన వెళ్లిపోయిన తర్వాత వేరెవరో వచ్చి ఉంటారన్న రీతిలో అనుమానాలు వచ్చేలా ఉండటం గమనార్హం. చందన, ఆమె బాయ్ ఫ్రెండ్ కలిసి దీప్తి చనిపోవడానికి తమకు సంబంధం లేదని నమ్మించడానికి ఈ రకంగా మేసెజ్ పెట్టారా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ దిశలో పోలీసు దీప్తి సెల్‌ఫోన్ డాటాను పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment