జగిత్యాల మున్సిపాలిటీ కార్యలయం
జగిత్యాలలో ‘జుడా’కు నిర్ణయం
కోరుట్ల, మెట్‌పల్లి పరిధిలోనూ ప్రతిపాదన
జిల్లాలో రెండు అథారిటీల ఏర్పాటుకు సన్నాహాలు
కోరుట్ల: జిల్లాలో కొత్తగా రెండు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ఏర్పాటుకు సన్నాహాలు సాగుతున్నాయి. జగిత్యాల మున్సిపాలిటీని ఆనుకుని 15 కిలో మీటర్ల పరిఽధిలో కొంతమేర పట్టణీకరణ ఆనవాళ్లు ఉన్న గ్రామాల అభివృద్ధికి త్వరలో జగిత్యాల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి (జుడా)కు రూపు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ‘జుడా’ పరిధిలో ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీల పరిధిలోని కొన్ని గ్రామాలు చేరనున్నట్లు సమాచారం. దీంతోపాటు కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల పరిధిలో పది కిలోమీటర్ల మేర పట్టణీకరణకు దగ్గరగా ఉన్న గ్రామాలతో మరో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఈ రెండు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలకు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేసిన అధికారులు.. ఉన్నతాధికారుల సూచనల మేరకు త్వరలో ప్రతిపాదనలు పంపనున్నట్లు సమాచారం.
పట్టణీకరణ ఆనవాళ్లు ప్రామాణికం
జగిత్యాల, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీల పరిధిలో ‘జుడా’ కోసం ప్రతిపాదించారు. ఇందులో జగిత్యాల నుంచి 15 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో ఉన్న ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలతోపాటు మేడిపల్లి, కోరుట్ల మండలాల్లోని కొన్ని గ్రామాలు రానున్నాయి. కోరుట్ల, మెట్‌పల్లి, మున్సిపాలిటీల నుంచి పది కిలోమీటర్ల రేడియస్ పరిధిలో ఉన్న గ్రామాలు అంటే మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన కొన్ని గ్రామాలతో రెండో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కింద చేర్చనున్నట్లు తెలి సింది. ఈ లెక్కన జిల్లాలో జగిత్యాలకేంద్రంగా ఒక అర్బన్‌డెవలప్‌మెంట్ అథారిటీ, కోరుట్ల, మెట్‌పల్లి కేంద్రాలుగా మరో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. మొదట జగిత్యాల పరిధిలోని జుడా ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. తరువాత కోరుట్ల, మెట్‌పల్లి పరిధిలోని రెండో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ విషయంలో కదలిక ఉంటుందని సమాచారం. ఈ రెండు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పరిధిలోకి నిర్ధారిత రేడియస్ దూరంతోపాటు పట్టణీకరణ ఎక్కువగా ఉన్న సుమారు 50 నుంచి 62 గ్రామాలు చేరే అవకాశాలు ఉన్నాయి. అర్బన్ డెవలప్‌మెంట్ అ థారిటీకి ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే ఆయా గ్రామాల్లో లేఅవుట్ పర్మిషన్లు, 300 చదరపు గజాలకు మించిన నిర్మాణాలు, షా పింగ్ కాంప్లెక్స్‌లు, పరిశ్రమలు, ఇతరత్రా అనుమతులు అథారిటీ నుంచే పొందే అవకాశం ఉంది. అంతే కాకుండా అథారిటీల పరిధిలోని గ్రామాల అభివృద్దికి అదనంగా నిధులు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
అథారిటీ ఏర్పాటు ఇలా..
జిల్లాలో ప్రతిపాదించిన అర్బన్‌డెవలప్‌మెంట్ అథారిటీలకు కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. అథారిటీ చైర్మన్‌ను అధి కా రపక్షంలో ఉన్న నేతలను ప్రభుత్వం నియమించే అవకాశాలు ఉన్నాయి. వైస్ చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ ఉండనున్నారు. వీరితో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యకలాపాల నిర్వహణకు జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు సభ్యులుగా ఉండే అవకాశాలున్నాయి. జుడా ప్రతిపాదనలకు అనుమతి వచ్చిన అనంతరం జుడా అర్బన్ డెవలప్ అథారిటీకి పాలకవర్గం నియామకం జరగనున్నట్లు సమాచారం. వీటికి సంబంధించిన పూర్తి అనుమతులు వచ్చేసరికి కొంత సమయం పడుతుందని అధికార యంత్రాంగం చెబుతోంది.
ప్రతిపాదనలు పంపాం
ఉన్నతాధికారులు సూచించిన మేరకు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేశాం. ప్రభుత్వం కోరితే వాటిని పంపిస్తాం. జగిత్యాల మున్సిపల్ పరిధిలో ఓ అర్బన్‌డెవలప్‌మెంట్ అథారిటీ, కోరుట్ల, మెట్‌పల్లి పరిధిలో మరో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రతిపాదనలు రూపొందించాం.
– శ్రీనివాస్, జిల్లా టౌన్‌ప్లానింగ్ అధికారి


