కోళ్ల ప్రాణం తీసిన డీజే సౌండ్‌! | UP Sulthanpur 140 Chickens Dies Due To Loud DJ Music At Baraat, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

కోళ్ల ప్రాణం తీసిన డీజే సౌండ్‌!

Apr 30 2026 8:15 AM | Updated on Apr 30 2026 10:04 AM

UP Sulthanpur Chickens Dies After DJ Loud Music Is Possible

బరాత్‌లు, ఊరేగింపుల టైంలో జోష్‌ కోసం చెవులకు చిల్లులు పడే రేంజ్‌లో డీజేలు ఏర్పాటు చేస్తుంటారు కొందరు. ఆ అత్యుత్సాహం ఒక్కోసారి విషాదాలకు.. విపరీతాలకూ దారి తీసే అవకాశమూ లేకపోలేదు. శబ్ధ కాలుష్యం వల్ల పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతుంటారు. అందుకు మూగ జీవాలు, పక్షులు కూడా మినహాయింపే కాదు. డీజే మ్యూజిక్‌ కారణంగా తన కోళ్లు గుండె ఆగి చనిపోయాయంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశమైంది.

ఏప్రిల్ 25న ఉత్తర ప్రదేశ్‌ సుల్తాన్‌పూర్‌ జిల్లా రామ్‌భద్రపూర్వ గ్రామానికి చెందిన బాబన్ విశ్వకర్మ తన కుమార్తె వివాహాన్ని జరిపి, అత్తారింటికి పంపే సమయంలో ఊరేగింపులో డీజే ఏర్పాటు చేశారు. గ్రామం అంతా డీజే శబ్దాలతో ఊగిపోయింది. అయితే, ఆ ఊరేగింపు సబీర్ అలీ నిర్వహిస్తున్న పౌల్ట్రీ ఫారమ్‌ పక్కన వెళ్లింది. ఆ సమయంలో సౌండ్‌ కారణంగా కోళ్లు భయంతో వణికిపోయి చెల్లాచెదురయ్యాయి. చివరకు గుండె ఆగి చనిపోయాయి.

సుల్తాన్‌పూర్‌లో జరిగిన ఘటన అసాధారణం కాదు. అధిక శబ్దం వల్ల కోళ్లు షాక్‌కు గురై చనిపోవడం శాస్త్రీయంగా సాధ్యమే. ఈ ఘటనలో మొత్తం 140 కోళ్లు చనిపోయాయని అలీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అవి చనిపోవడానికి డీజే ఆపరేటర్ కవి యాదవ్‌ కారణమని సబీర్‌ ఆరోపిస్తున్నాడు. అయితే పోలీసులు యాదవ్‌ను ప్రశ్నించి వదిలేశారు. 

అధిక శబ్దం కేవలం మనుషులకే కాకుండా జంతువులపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే ఇలాంటి డీజేలు పెట్టినప్పుడు సౌండ్‌ కంట్రోల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు సోషల్‌ మీడియాలో అభిప్రాయపడుతుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement