120 కిలోల గంజాయి పట్టివేత
గోదావరిఖని(రామగుండం): రామగుండం కమిషనరేట్ పోలీసులు 120 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గోదావరిఖని టూటౌన్ పోలీసులు జీడీకే–11 గని క్రాస్ వద్ద 96.770 కిలోలు, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ రోడ్డులోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా షాపింగ్ కాంప్లెక్స్ సెల్లార్‌లో 23.50 కిలోల గంజాయిని పట్టుకున్నారని సీపీ ఎం శ్రీనివాస్ తెలిపారు. మొత్తం 15 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం వివరాలు వెల్లడించారు.
గోదావరిఖని టూటౌన్ పరిధిలో..
గోదావరిఖని టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జీడీకే–11 గని క్రాస్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో 2 కార్లలో తరలిస్తున్న 96.770 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఉదయ్‌వీర్, రాజస్థాన్‌లోని దోల్పూర్‌కు చెందిన రాజ్‌లోథి, ఒడిశాలోని కోరుపుత్‌కు చెందిన కేశవ్‌ఖోరా, సోమంత ఖోరాలను అరెస్ట్ చేశారు. కారు యజమాని సూరజ్, గంజాయి సరఫరాదారు చత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌కు చెందిన అర్జున్‌భోరిలు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. గంజాయితోపాటు కార్లు, 6 ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. జగదల్‌పూర్ నుంచి మంథని మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుకున్నట్లు వెల్లడించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో..
మంచిర్యాలలో సీసీ కెమెరాల వ్యాపారం ముసుగులో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు సీపీ శ్రీనివాస్ తెలిపారు. 23.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆయ న వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ రోడ్‌లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంప్లెక్స్ సెల్లార్‌లో సోమ ప్రవీణ్‌కుమార్ వైఇన్‌ఫోం సొల్యూషన్స్ పేరిట సీసీ కెమెరాల గోడౌన్ నిర్వహిస్తున్నాడు. కానీ, అందులోనే గంజాయి నిల్వ ఉంచారు. పక్కా సమాచారం రావడంతో మంచిర్యాల పోలీసులు గోడౌన్ వద్దకు వెళ్లి, అనుమానస్పదంగా కనిపించిన కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని, విచారించగా గంజాయి నిల్వలు బయట పడ్డాయి. మంచిర్యాల జిల్లా రాజీవ్‌నగర్‌కు చెందిన ఇరుగురాళ్ల సతీశ్‌కుమార్, సప్తగిరికాలనీకి చెందిన మహమ్మద్ సమీర్, ఓ బాలుడు, అశోక్‌రోడ్‌కు చెందిన భీమ అనుదీప్, తిలక్‌నగర్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్‌ఉబేద్, రాజీవ్‌నగర్‌కు చెందిన జాగి రాఘవేంద్రస్వామి, నస్పూర్‌కు చెందిన గూడూరు రాము, ఎస్‌కే.అథార్‌హుర్, ఎస్‌కే.సమీర్, కరీంనగర్ హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన అర్జున బాబు రావుచౌహాన్, కార్ఖానాగడ్డకు చెందిన మమమ్మద్ అజీజ్‌లను అరెస్ట్ చేయగా, మరో 11 మంది పరా రీలో ఉన్నట్లు సీపీ పేర్కొన్నారు. గంజాయితోపాటు 11 ఫోన్లు, 5 బైక్‌లు, ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సతీశ్‌కుమార్ డ్రైవర్‌గా పనిచేస్తూ సీసీ కెమెరాల వ్యాపారం చేసే ప్రవీణ్‌కుమార్‌తో కలిసి గంజాయి వ్యాపారానికి దిగినట్లు వెల్లడించారు. సీలేరు వద్ద తక్కువ ధరకు ఎండు గంజాయి తెచ్చారని పేర్కొన్నారు. గంజాయి ముఠాలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన స్పెషల్ బ్రాంచి, టాస్క్‌ఫోర్స్, గోదావరిఖని టూటౌన్, మంచిర్యాల పోలీసులను ఆయన అభినందించారు. పెద్దపల్లి డీసీపీ చేతన, అడ్మిన్ డీసీపీ రాజు, స్పెషల్ బ్రాంచి ఏసీపీ రాఘవేంద్ర, మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు రాజ్‌కుమార్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
15 మంది అరెస్టు
గంజాయితోపాటు 2 కార్లు, 5 బైక్‌లు, 17 ఫోన్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన రామగుండం సీపీ శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment