నాగులపేటలో ఇసుక వివాదం
● రీచ్ ఓచోట.. తరలింపు మరోచోటు నుంచి
● కలెక్టర్ సీరియస్.. ఇసుక డంపుల సీజ్
కోరుట్ల: మండలంలోని నాగులపేటలో ఇసుక తరలింపు అంశం వివాదాస్పదంగా మారింది. రీచ్ ఓచోట ఉండగా.. మరోచోటు నుంచి తీసుకెళ్తుండటాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. వివరాల్లోకి వెళ్తే.. కోరుట్ల మండలంలోని పైడిమడుగు వాగు నుంచి ఇసుక తరలింపు కోసం రీచ్‌కు రెవెన్యూ అధికారులు అనుమతించారు. ఇక్కడి ఇసుక నాణ్యత తక్కువగా ఉండటంతో కొనుగోలుకు వినియోగదారులు ఇష్టపడటం లేదు. దీంతో ఇసుక రవాణాదారులు కొత్త దారిని ఎంచుకున్నారు. పైడిమడుగు ఇసుక రీచ్ పేరిట ఒక్కో ట్రాక్టర్‌కు రూ.800 డీడీలు కట్టి, వాటి ఆధారంగా ఇసుక బాగుండే నాగులపేట వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్నారు. అంతేకాదు, ఒకటి, రెండు ట్రాక్టర్ల ఇసుక తీసుకెళ్లేందుకు డీడీలు కట్టి, పొద్దంతా అడ్డగోలుగా రవాణా చేస్తున్నారు. ఈ వ్యవహారం కలెక్టర్ సత్యప్రసాద్ వరకు వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారు. స్వయంగా నాగులపేట వాగు వద్దకు వచ్చి, పరిశీలించారు. వాగు పరిసరాల్లో ఉన్న ఇసుక డంపులను సీజ్ చేయాలని ఆదేశించడంతో అధికారులు బుధవారం సీజ్ చేశారు. ఈ విషయమై తహసీల్దార్ కిషన్‌ను వివరణ కోరగా.. ఇసుక, మొరం తరలింపుపై కఠినంగా వ్యవహరిస్తున్నామని, అక్రమ రవాణా చేస్తే జరిమానా విధించడంతోపాటు వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment