గెలుపెవరిదో..
● చెల్లుబాటు ఓట్లలో సగం మెజారిటీ సాధిస్తేనే విజయం ● లేకపోతే అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు ● ప్రతిరౌండ్‌లోనూ ఎగ్జాస్టెడ్, సబ్ పార్సిల్ ఓట్లు కీలకం ● ఎలిమినేటెడ్ అభ్యర్థి తొలి ప్రాధాన్య ఓట్లు తీసివేత ● మిగిలిన సబ్ పార్సిల్ ఓట్లు అభ్యర్థులకు బదిలీ ● విజయంపై స్పష్టత వచ్చేవరకూ కొనసాగనున్న కౌంటింగ్ ● సాయంత్రానికి ‘టీచర్’ ఫలితం.. పట్టభద్రుల ఫలితానికి రెండు రోజులు?
సబ్ పార్సిల్ ఓట్లు కీలకం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్– ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ స్థానాలకు ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సోమవారం మొదలు కానుంది. కరీంనగర్‌లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గాలకు లెక్కింపు జరగనుంది. ఇందుకోసం మొత్తం 35 టేబుళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం, 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్ల కోసం కేటాయించారు. ఒక్కో టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. వీరిలో ఒక మైక్రోఅబ్జర్వర్, ఒక సూపర్‌వైజర్, ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు ఉంటారు. వీరందరికీ శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సంబంధిత అధికారులు శిక్షణ ఇచ్చారు. లెక్కింపు కోసం మొత్తం 800 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఇందులో 20 శాతం రిజర్వ్ సిబ్బందిని నియమించారు. ఆదివారం మాక్ కౌంటింగ్‌ను ఎన్నికల అధికారులు చేపట్టారు. ఈ ప్రక్రియను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు.
ఫార్ములా ఆధారంగా కోటా నిర్ధారణ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లుబాటయ్యే ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ముందుగా కోటాను నిర్ధారించాల్సి ఉంటుంది. పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసేసి చెల్లుబాటయ్యే ఓట్ల లెక్క తేలుస్తారు. మొత్తం చెల్లబాటయ్యే ఓట్లలో 50 శాతం లెక్కగడతారు. 50శాతానికంటే ఒక్క ఓటు ఎక్కువగా సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ముందుగా ఓట్లను కట్టలు కడతారు. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల ఒక్కొక్కరికి ఒక డబ్బా కేటాయించి వారు పొందిన ఓట్లను ఆ డబ్బాల్లో వేస్తారు. ఆ తర్వాత అభ్యర్థి సాధించిన ఓట్లను లెక్కగడతారు. సాధారణ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. కానీ.. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కాస్త భిన్నంగా ఉంటుంది. ఇందుకోసం ఒక ఫార్ములా వాడతారు. అదేంటంటే.. కోటా = మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లు డివైడెడ్‌బై సీట్ల సంఖ్య ప్లస్ వన్ ఓల్ ప్లస్ వన్ అన్న సూత్రం ఆధారంగా ఓట్ల లెక్కింపు చేపడతారు. (ఉదాహరణకు: మొత్తం రెండు వేల ఓట్లు పోలైతే వాటిలో 1800 ఓట్లు చెల్లుబాటు ఐతే 901 ఓట్లు సాధించిన వ్యక్తి విజయం సాధిస్తారు.) తొలుత తొలి ప్రాధాన్యం ఓట్లను అభ్యర్థుల వారీగా పంచుతారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ఏ అభ్యర్థి 901 ఓట్ల కోటాను చేరుకోకపోతే ఆప్పుడు రెండో రౌండ్‌కు లెక్కింపు ప్రక్రియ వెళ్తుంది.
● రెండో రౌండ్ అంటే ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలి రౌండ్‌లో అందరి కంటే తక్కువ ఓట్లు సాధించిన వ్యక్తిని రెండో రౌండ్‌లో తప్పిస్తారు. ఇక్కడ ఓటింగ్ సరళిని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ ఎన్నికల్లో రెండు రకాలుగా ఓట్లను విభజిస్తారు. ఓటర్లు రెండు రకాలుగా ఓట్లు వేస్తారు. ఒకటి కేవలం తొలి ప్రాధాన్యం ఓట్లు మాత్రమే వేసేవారు. ఒకటి కంటే ఎక్కువ ప్రాధాన్యాలు ఇచ్చేవారు. తొలిరౌండ్‌లో తక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తికి తొలి ప్రాధాన్యం మాత్రమే వచ్చిన ఓట్లను ఎగ్జాస్టెడ్ ఓట్లుగా పరిగణించి వాటిని తప్పిస్తారు. మిగిలిన రెండో రౌండ్ ప్రాధాన్యం ఓట్లను (సబ్ పార్సిల్ ఓట్లు) అభ్యర్థులకు పంచుతారు. అలా ఫార్ములా ప్రకారం.. ఏ రౌండ్‌లో అయితే చెల్లుబాటు అయిన ఓట్లలో ఒక అభ్యర్థికి సగం ఓట్లు వచ్చేంత వరకు రౌండ్లు (ఎలిమినేషన్) ప్రక్రియ సాగుతుంది. అప్పుడే విజేతను ప్రకటిస్తారు.
లెక్కింపు గణాంకాలు
వేదిక: అంబేడ్కర్ స్టేడియం, కరీంనగర్
గ్రాడ్యుయేట్స్ పోలైన ఓట్లు : 2,50,106
టీచర్స్‌లో పోలైన ఓట్లు: 24,895
మొత్తం టేబుళ్లు: 35
పట్టభద్రుల టేబుళ్లు : 21
టీచర్ల టేబుళ్లు : 14
లెక్కింపు సిబ్బంది: 800
రిజర్వ్ స్టాఫ్: 20 శాతం
ఎలా లెక్కిస్తారంటే?
కరీంనగర్– మెదక్– ఆదిలాబాద్– నిజామాబాద్ జిల్లాల టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు నిర్వహించారు. గ్రాడ్యుయేట్ స్థానంలో మొత్తం 3,55,159 మంది ఓటర్లుండగా.. గతనెల 27న జరిగిన ఎన్నికల్లో 2,50,106 మంది (70.42 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీచర్ నియోజకవర్గంలో మొత్తం 27,088 ఓట్లు ఉండగా.. 24,895 మంది (91.90 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తక్కువ ఓట్లు ఉన్న నేపథ్యంలో టీచర్ స్థానం ఫలితం సాయంత్రానికి వెలువడనుంది. అధిక ఓటర్లున్న గ్రాడ్యుయేట్ స్థానం కనీసం రెండు రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఒక్కో సందర్భంలో మూడో రోజుకు చేరినా ఆశ్చర్యం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
400 మంది పోలీసుల బందోబస్తు
కరీంనగర్‌క్రైం: ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు సోమవారం 400 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. అంబేడ్కర్ స్టేడియంలో జరిగే ఈ ప్రక్రియలో ఒక అడిషనల్ డీసీపీ, ఆరుగురు ఏసీపీలు, 18 మంది ఇన్‌స్పెక్టర్లు, 30 మంది ఎస్సైలతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొననున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌటింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది, మీడియా ప్రతినిధులు అంబేడ్కర్ స్టేడియంలోని గేట్ నంబర్– 1 నుంచి ప్రవేశించి నిర్దేశించబడిన ప్రదేశంలో వారి వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. గేట్ నంబర్– 4 ద్వారా అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాలులోకి అనుమతించబడునని పోలీసులు తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లుగా వచ్చే వారికి కరీంనగర్ కలెక్టరేట్ గేట్ నంబర్– 2 ద్వారా అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.
గెలుపెవరిదో..
గెలుపెవరిదో..
గెలుపెవరిదో..
Comments
Please login to add a commentAdd a comment