ఖర్బూజ తోటలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి
జగిత్యాలఅగ్రికల్చర్: ఎప్పుడూ కోర్టులో కక్షిదారులు, న్యాయవాదులు, న్యాయమూర్తులతో బిజీగా ఉండే జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నీలిమ ఆదివారం పొలంబాట పట్టారు. సారంగాపూర్ మండలంలోని పెంబట్ల–కోనాపూర్‌లో బండారి వెంకటేశ్, విజయ దంపతులు సాగుచేస్తున్న ఖర్బూజ(పుచ్చకాయ) తోటను సందర్శించారు. ఖర్బూజలో పసుపుపచ్చ రకాన్ని చూసి జడ్జి ఆనందం వ్యక్తం చేశారు. రైతు దంపతులతో కలిసి రెండుగంటలపాటు తోటలో తిరుగుతూ.. సాగు విధానాన్ని పరిశీలించారు. విత్తనాలు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు..? మార్కెటింగ్ ఎలా చేసుకుంటున్నారంటూ అడిగి తెలుసుకున్నారు.
ప్రజాస్వామ్య విలువలు కాపాడిన శ్రీపాదరావు
జగిత్యాలటౌన్: రాజకీయ జీవితంలో శ్రీపాదరావు అపారమైన కీర్తి ప్రతిష్టలు గడించారని, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్‌గా ప్రజాస్వామ్య విలువలు కాపాడిన గొప్ప నాయకుడని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లత, జిల్లా సంక్షేమ అధికారి నరేశ్, సిరిసిల్ల శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వరి పొలాల సందర్శన
జగిత్యాలఅగ్రికల్చర్: వరి సాగును సాధారణంగా డిసెంబర్ మొదటివారంలో నార్లు పోసి.. నాటు వేసి, ఏప్రిల్‌లో పంటను కోస్తుంటారు. అయితే కొడిమ్యాల మండలం గౌరాపూర్ రైతులు మాత్రం అక్టోబర్‌లో సాగు ప్రారంభించి, మార్చి మొదటి వారంలో వరి సీజన్‌ను ముగిస్తున్నారు. ఆ మండలంలో నీటి ఎద్దడి ఎక్కువ కావడంతో నీరు అందక పంటలు ఎండుతుంటాయి. ఈ క్రమంలో కొందరు రైతులు ప్రైవేట్ కంపెనీల విత్తనాలను సాగు చేస్తున్నారు. ఆ పంటలను వ్యవసాయ వర్సిటీ మాజీ సలహా మండలి సభ్యుడు పూడూరు రాంరెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల విద్యార్థులు సందర్శించారు. పంట తీరును పరిశీలించారు.
ఖర్బూజ తోటలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి
Comments
Please login to add a commentAdd a comment