రాయికల్ బల్దియాలో సమస్యల దరువు
● ఏడాదిలో ఐదుగురు కమిషనర్లు బదిలీ ● పేరుకుపోతున్న పారిశుధ్యం ● ఎక్కడిక్కడ నిలుస్తున్న మురుగునీరు ● స్వైరవిహారం చేస్తున్న దోమలు ● నూతన కమిషనర్‌పైనే ఆశలు
రాయికల్: రాయికల్ పేరుకే మున్సిపాలిటీ. కానీ.. బల్దియా స్థాయిలో వసతులు మాత్రం మచ్చుకై నా కనిపించవు. ఫలితంగా పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మేజర్ గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్చడంతో పట్టణం ప్రగతిపథంలో దూసుకెళ్తుందని, సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. ఏడాది వ్యవధిలో ఐదుగురు కమిషనర్లు బదిలీ అవుతూ వస్తున్నారు. మరోవైపు పాలకవర్గ పదవీకాలం ముగియడంతో పట్టణ సమస్యలు కమిషనర్‌కు స్వాగతం పలుకుతున్నాయి.
సమస్యలివే..
బల్దియాలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ప్రతివార్డులోని కాలనీలు అపరిశుభ్రంగా మారాయి. ఇళ్ల మధ్య నుంచి డ్రైనేజీలు ఉండడంతో మురికి నీరు సక్రమంగా ముందుకు ప్రవహించక దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఫలితంగా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే బల్దియాలోని శివాలయం వీధి, చెన్నకేశవనాథనగర్‌కాలనీ జలమయం అవుతున్నాయి. చెత్త సేకరించేందుకు ఉన్న వాహనాలు కూడా మరమ్మతుకు గురయ్యాయి. పారిశుధ్య సిబ్బంది సరిపడా లేకపోవడంతో చెత్త సేకరణ సక్రమంగా సాగడం లేదు. ఇందిరనగర్ కాలనీలో ఏళ్ల తరబడి తాగునీటి ఎద్దడితో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బల్దియాలోని మాదిగకుంట స్థలంలో ఇరువైపులా కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. క్రమంగా మాదిగకుంటను కబ్జా చేస్తున్నారు. బల్దియాలో సమీకృత మార్కెట్ లేకపోవడంతో రోడ్డుపైనే వారసంత నిర్వహిస్తున్నారు. వారసంతలోంచే ద్విచక్ర వాహనాలు, ఇతరత్రా వాహనాలు వెళ్లడంతో వారసంతలోని వర్తక వ్యాపారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పాతబస్టాండ్, గాంధీచౌక్, శివాజీచౌక్ వద్ద ప్రయాణీకుల కోసం సౌకర్యాలు కల్పించలేదు. దీంతో వారు దాహర్తిని తీర్చుకోలేకపోతున్నారు. పాతబస్టాండ్‌లో మూత్రశాలలు లేకపోవడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. బల్దియాలో కేవలం ఒకే ఒక ఓపెన్ జిమ్ ఉండటంతో కొంతమందికే పరిమితమవుతోంది. మరో ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేయాలని వాకర్స్ కోరుతున్నారు.
ఏడాదిలో ఐదుగురు కమిషనర్లు బదిలీ:
గతేడాది ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ దృష్ట్యా బదిలీల్లో అప్పటి ఇన్‌చార్జి కమిషనర్ ఎంపీడీవో సంతోష్ కుమార్ భీంగల్‌కు.. మెట్‌పల్లిలో విధులు నిర్వహిస్తున్న జగదీశ్వర్‌గౌడ్‌ను రాయికల్‌కు కమిషనర్‌గా బదిలీ చేశారు. జూలైలో జగదీశ్వర్‌గౌడ్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆ సమయంలో స్థానిక ఎంపీడీవో చిరంజీవికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆగస్టులో జగదీశ్వర్‌గౌడ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయడంతో తిరిగి విధుల్లో చేరారు. రెండు నెలల క్రితం జగదీశ్వర్‌ను నిర్మల్ మున్సిపాలిటీకి బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న ఖమర్ అహ్మద్‌ని రాయికల్‌కు బదిలీచేశారు. కానీ ఆయన విధుల్లో చేరలేదు. దాదాపు పది రోజుల అనంతరం రాయికల్ మున్సిపల్‌లో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న బి.వెంకటికి ఇన్‌చార్జి కమిషనర్ బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో గతనెల 25న ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ మనోహర్‌ను రాయికల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఇలా ఏడాదికాలంలో ఐదు గురు కమిషనర్లు మారడంతో పట్టణంలో పలు ముఖ్యమైన అంశాలపై తగిన పురోగతి లేదని ప్రజలు వాపోతున్నారు
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
బల్దియాలో పారిశుధ్యం, వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. వేసవి కాలం దృష్ట్యా తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. పట్టణవాసులకు ఎలాంటి ఇబ్బందులున్నా నేరుగా దృష్టికి తీసుకురావచ్చు.
– మనోహర్‌గౌడ్,
మున్సిపల్ కమిషనర్
రాయికల్ బల్దియాలో సమస్యల దరువు
రాయికల్ బల్దియాలో సమస్యల దరువు
Comments
Please login to add a commentAdd a comment