విద్యుత్ లోడ్ ‘నియంత్రికలు’
● జిల్లాలో 23,862 ట్రాన్స్‌ఫార్మర్లు ● ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తున్న విద్యుత్‌శాఖ ● లోడ్ ఉన్న చోట అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల బిగింపు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో వ్యవసాయం, గృహ, పరిశ్రమల అవసరాలకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరం సరఫరా చేసేందుకు విద్యుత్‌శాఖ ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తోంది. ఆ మేరకు విద్యుత్ సరఫరాలో నష్టాన్ని నివారించడం, లోవోల్టోజి సమస్యకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో అధిక లోడ్‌ను నియంత్రించేందుకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా యుద్ధ ప్రతిపాదికన ఏర్పాటు చేస్తున్నారు.
జిల్లాలో 23,862 ట్రాన్స్‌ఫార్మర్లు
జిల్లాలో 23,862 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు పనిచేస్తున్నాయి. వీటికి అదనంగా.. అవసరమైన చోట మరిన్ని ట్రాన్స్‌ఫార్మర్లను బిగిస్తున్నారు. జిల్లాలో లోడ్‌ను బట్టి 500 కేవీ, 400 కేవీ, 315కేవీ, 250కేవీ, 200కేవీ, 160కేవీ, 100 కేవీ, 75కేవీ, 63కేవీ, 50కేవీ, 40కేవీ, 25కేవీ, 16 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఎనిమిది విద్యుత్ సబ్ డివిజన్లు ఉండగా.. వాటి పరిధిలో 35 విద్యుత్ సెక్షన్‌లు ఉన్నాయి. జగిత్యాల టౌన్ సబ్ డివిజన్ పరిధిలో 2,436, జగిత్యాల రూరల్ సబ్ డివిజన్ పరిధిలో 3,313, ధర్మపురి సబ్ డివిజన్ పరిధిలో 3,255, మల్యాల సబ్ డివిజన్ పరిధిలో 2,208, గొల్లపల్లి సబ్ డివిజన్ పరిధిలో 2,030, మెట్‌పల్లి సబ్ డివిజన్ పరిధిలో 1,589, మల్లాపూర్ సబ్ డివిజన్ పరిధిలో 3,268, కోరుట్ల టౌన్ సబ్ డివిజన్ పరిధిలో 1,813, కోరుట్ల రూరల్ సబ్ డివిజన్ పరిధిలో 3,950 ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. వీటి ద్వారా 45వేల ఎల్‌టీ ఫీడర్‌ల ద్వారా ఇళ్లు, వ్యవసాయ బావులకు విద్యుత్ సరఫరా అవుతోంది. రోజుకు 3.5 నుంచి 4 మిలియన్ యూనిట్ల వరకు సరఫరా అవుతోంది. ట్రాన్స్‌ఫార్మర్‌పై ఫ్యూజ్ పోయినా.. విద్యుత్ సరఫరా నిలిచినా.. రైతులు ట్రాన్స్‌ఫార్మర్లపైకి ఎక్కి ప్రయోగాలు చేయవద్దని, విద్యుత్ సిబ్బంది, అధికారులకు సమాచారం ఇవ్వాలని పంచాయతీ బోర్డులపై విద్యుత్ సిబ్బంది సెల్‌ఫోన్ నంబర్లు రాయించారు. కంట్రోల్ రూం నంబర్లను కూడా ప్రదర్శిస్తున్నారు.
నిరంతర విద్యుత్ సరఫరా కోసం..
ప్రస్తుతం గృహాలు, పరిశ్రమలు, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో సరఫరాలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన చేసి కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయడంతోపాటు.. ఇప్పటికే అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో అదనపు నియంత్రికలను అమర్చుతున్నారు. వేసవికాలం కావడం.. విద్యుత్‌కు డిమాండ్ పెరగడంతో.. వ్యవసాయానికి ఇచ్చే త్రీఫేజ్ విద్యుత్‌లో ఇబ్బందులు రాకుండా అధిక లోడ్‌ను భరించే ట్రాన్స్‌ఫార్మర్లను బిగిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ లోడ్‌ను బట్టి విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment