ఇక సన్నబియ్యమే
ఉమ్మడి జిల్లాలో రేషన్‌కార్డులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సన్నబియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాల్లో ఇప్పటికే రేషన్‌షాపులకు సన్నబియ్యం వచ్చేశాయి. వీటిని ఉగాది రోజు నుంచే పంపిణీ చేయనున్నారు. కార్డులో ఉన్న ప్రతీవ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ జరగనుంది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో దాదాపు 80 శాతం జనాభాకు తెల్లరేషన్‌కార్డులు (ఫుడ్ సెక్యూరిటీ కార్డులు) ఉన్నాయి. వీరందరికీ సన్నబియ్యం అందనున్నాయి. గతంలోనూ ఇవే కార్డుల మీద ప్రభుత్వం రేషన్‌షాపుల ద్వారా ఉచిత బియ్యం పంపిణీ చేసింది. కానీ... వాటిని లబ్భిదారులు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదు. బియ్యం దొడ్డుగా ఉన్న కారణంతో వాటిని హోటళ్లు, వ్యాపారులకు విక్రయించేవారు. ఇవే బియ్యాన్ని సదరు వ్యాపారులు పాలిష్ చేసి సన్నబియ్యంగా మార్చి అమ్ముకునేవారు. ఇకపై బియ్యాన్ని లబ్ధిదారులే వినియోగించుకునేలా.. పకడ్బందీగా సన్నబియ్యం పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పంతో ఉంది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమక్‌కుమార్ రెడ్డి జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా ఉండటంతో అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
రేషన్ కార్డులందని, డీలీట్ అయిన వారి కష్టాలు..
కొందరు లబ్ధిదారులకు ఇంకా రేషన్‌కార్డులు అందలేదు. వీరంతా గతేడాది ప్రజాపాలన, మీసేవా, ప్రజావాణి, ఇటీవల మరోసారి ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నారు. కొత్తగా పెళ్‌లైన జంట లు తమ పేర్లను కుటుంబాల నుంచి డిలీట్ చేసుకుని, కొత్త వాటికి దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా అర్హులైనా.. ఇంతవరకు రేషన్‌కార్డులు అందలేదు. అయితే దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఏప్రిల్‌లో అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, జనవరి 26 సందర్భంగా నిర్వహించిన ఆరుగ్యారెంటీల అమలు కోసం పైలెట్ ప్రాజెక్టు కింద కొందరు లబ్ధిదారులను అధికారులు రేషన్ జాబి తాలో ఎంపిక చేశారు. వీరికి నెలానెలా సరుకులు వస్తాయనుకున్నా.. నేటికీ ఎలాంటి సరుకులు అందడం లేదు. ఉగాది నుంచైనా కార్డులు పనిచేస్తాయా? లేదా? అన్న సందిగ్ధంలో లబ్ధిదారులు ఉన్నారు.
బియ్యం దందా బంద్‌అయ్యేనా?
ఇంతకాలం రేషన్ బియ్యాన్ని కొని మహారాష్ట్రతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో విక్రయించే వారికి జిల్లాలో విస్తృత నెట్‌వర్క్‌ఉంది. ఉమ్మడి జిల్లాలోని ప్రతీ గ్రామం, పట్టణాలలో ఇంటింటికీ మోపడ్ బండ్లపై తిరుగుతూ రేషన్‌బియ్యం సేకరించే వారికి ఇకపై మునపటి స్థాయిలో దందా నడవకపోవచ్చు. గోదావరిఖని, మంథని మీదుగా గోదావరి దాటి మహారాష్ట్రలోకి బియ్యం పంపే వీరు అక్కడ వాటిని ప్రాసెస్, పాలిష్ చేసి కేజీ రూ.50 చొప్పున విక్రయిస్తారు. రెండేళ్ల క్రితం కరీంనగర్ నుంచే రైల్వే వ్యాగన్లలో రేషన్ బియ్యం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశారంటే వీరి దందా ఏస్థాయిలో నడిచేదో అర్థం చేసుకోవచ్చు. సన్నబియ్యం సరఫరా నేపథ్యంలో వీరి దందా బంద్ అయ్యేనా? లేక రూట్ మారుస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఉగాది నుంచి పంపిణీకి అధికారుల ఏర్పాట్లు
ఉమ్మడి జిల్లాలో 80 శాతం మంది ప్రజలకు ఉపయుక్తం
దొడ్డుబియ్యం దందాకు శాశ్వత పరిష్కారం
పేర్లు డిలిట్ అయిన వారికి ఇంకా అందని కార్డులు
ప్రజాపాలన రేషన్‌జాబితాలో పేర్లు వచ్చినా అందని సరుకులు