ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధం

Published Tue, Apr 1 2025 11:36 AM | Last Updated on Tue, Apr 1 2025 2:36 PM

ధాన్య

ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధం

● గ్రామాల్లో 407 కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక ● ఈనెల రెండోవారంలోపు అన్నిచోట్ల ప్రారంభం

జగిత్యాల అగ్రికల్చర్‌: యాసంగిలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వానాకాలం సీజన్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాలను ప్రస్తుతం యాసంగిలో ఏర్పాటుచేసేలా జిల్లా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలన్నింటినీ ఈనెల రెండో వారంలోపు ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నారు. యాసంగిలో ఎక్కడైనా సన్న ధాన్యం సాగు చేస్తే కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

జిల్లాలో 407 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో 407 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. సింగిల్‌ విండోల ఆధ్వర్యంలో 273, ఐకేపీ 133, మెప్మా ఆధ్వర్యంలో ఒక కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కేంద్రాల్లో ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,320, కామన్‌ రకానికి రూ.2,300 చొప్పున కొనుగోలు చేయనున్నారు.

2.96 లక్షల ఎకరాల్లో వరి సాగు

ఈ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 2.96 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈసారి తెగుళ్లు, పురుగులు లేక అనువైన వాతావరణం ఉండటంతో ఎకరాకు సగటున 23 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి దొడ్డు ధాన్యం 68.08 లక్షల క్వింటాళ్లు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు.

సమస్యలు పునరావృత్తం కాకుండా..

ధాన్యం కొనుగోళ్లలో గతంలో మాదిరిగా సమస్యలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే వివిధ దఫాలుగా కలెక్టర్‌ అడిషనల్‌ కలెక్టర్‌ సివిల్‌ సప్లై, డీఆర్‌డీఏ, సింగిల్‌ విండో, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే కొనుగోలు నిర్వాహకులకు శిక్షణ ఇచ్చారు. గన్నీ సంచులకు కొరత లేకుండా ఎప్పటికప్పుడు తెప్పించేలా ఏర్పాట్లు చేయనున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్‌మిల్లులకు తరలించేలా లారీ ట్రాన్స్‌పోర్ట్‌ యజమానులతో సమావేశం నిర్వహించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో రెండు ప్యాడీక్లీనర్‌ మిషన్లు అందుబాటులో ఉంచాలని, వేసవికాలం అయినందున కొనుగోలు కేంద్రంలో మంచినీటి వసతి, నీడ వసతి కల్పించాలని సూచించారు. టోకెన్‌ పద్ధతిని అమలు చేయాలని, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.

అధికారులతో మానిటరింగ్‌ బృందాలు

కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా అధికారులతో మానిటరింగ్‌ బృందాలు ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అధికారులు ఆ సమస్యను పరిష్కరించేలా కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూంను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ ఏఈఓ, గ్రామ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శిలతో సమన్వయం చేస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కేంద్రాల వద్ద ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తున్నారు.

కోతలు ఆపండి

జిల్లాలో వరి కోతలు ప్రారంభం అవుతున్నందున త్వరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. గతంలో క్వింటాల్‌కు నాలుగైదు కిలోలను రైస్‌మిల్లర్లు కోత విధించి రైతుల శ్రమను దోచుకున్నారు. ఈ సారి అలా జరుగకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. – రాజిరెడ్డి,

శ్రీరాములపల్లె, గొల్లపల్లి మండలం

ఇబ్బందులు రానీయం

రైతులకు ఇబ్బంది రాకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ నేతృత్వంలో మార్కెట్‌, రెవెన్యూ, వ్యవసాయ, సింగిల్‌ విండో, సివిల్‌సప్లై అధికారులతో ఇటీవల సమావేశం నిర్వహించాం. పక్కా ప్రణాళికతో ధాన్యం కొనుగోలు చేస్తూ ముందుకు సాగుతాం.

– ప్రకాశ్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి

ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధం1
1/3

ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధం

ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధం2
2/3

ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధం

ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధం3
3/3

ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement