
‘అంగన్‌వాడీ’ చిన్నారులకు కంటి పరీక్షలు
● 0–6 ఏళ్లలోపు పిల్లలను పరీక్షించనున్న వైద్యులు ● జిల్లావ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం
కథలాపూర్(వేములవాడ): ఇన్నాళ్లూ పాఠశాల విద్యార్థులకు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) వైద్యులు కంటి పరీక్షలు చేసి సమస్యలున్న వారికి కళ్లద్దాలు ఉచితంగా అందించారు. ఇదే తరహాలో అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు కూడా మానసిక, కంటి పరీక్షలు నిర్వహించాలని ఆర్‌బీఎస్‌కే వైద్య బృందాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో సోమవారం నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే ఆర్‌బీఎస్‌కే వైద్యుల బృందానికి అంగన్‌వాడీ కేంద్రాలు, చిన్నారుల వివరాలతో కూడిన జాబితా అందించారు.
జిల్లాలో 1,071 అంగన్‌వాడీ కేంద్రాలు
జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, 22మండలాలున్నాయి. వీటి పరిధిలో 1,071 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 64,297 మంది చిన్నారులున్నారు. వారందరికీ కంటి పరీక్షలు చేసేందుకు జిల్లావ్యాప్తంగా 10 ఆర్‌బీఎస్‌కే బృందాలకు బాధ్యతలు అప్పగించారు. పోషకాహారలోపం, జన్యుపరమైన కారణాలు, పిల్లలకు ఆహారం తినిపించాలని తల్లిదండ్రులు సెల్‌ఫోన్లు ఇస్తుండటంతో ఆరేళ్లలోపు చిన్నారులకు దృష్టిలోపం, ఇతర కంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. ఇందుకోసం ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ప్రత్యేకంగా కంటి పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. సుమారు 3 నెలలపాటు అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి కంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. సమస్యలున్న చిన్నారులను గుర్తించి వారి వివరాలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిస్తారు. దృష్టిలోపం ఉన్నట్లయితే వారికి ఉచితంగా కళ్లద్దాలు అందిస్తారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రులకు సిఫార్సు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
ఆరేళ్లలోపు చిన్నారులకు ఈనెల 7 నుంచి ఉచితంగా కంటి పరీక్షలు చేస్తాం. తల్లిదండ్రులు దగ్గరుండి పిల్లలకు పరీక్షలు చేయించాలి. సమస్యలను ఇప్పుడే గుర్తిస్తే భవిష్యత్తులో ఇబ్బంది ఉండదు. కంటి చూపు మందగిస్తే బోర్డుపై అక్షరాలు కనిపించక చదువులో వెనుకబడతారు. – సురేంద్ర కుమార్,
ఆర్‌బీఎస్‌కే వైద్యాధికారి

‘అంగన్‌వాడీ’ చిన్నారులకు కంటి పరీక్షలు