
‘కేవీ’ పిలుస్తోంది
● ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
● ఈనెల 11వ తేదీ వరకు చివరి గడువు
● 2 నుంచి 10వ తరగతి వరకు ఖాళీలు ఉంటేనే అడ్మిషన్లు
కరీంనగర్: ఆధునాతన సాంకేతిక విద్యనందించే కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు వేళయింది. ఈనెల 2నుంచి అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల సందడి మొద లైంది. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ 2025–26 సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు జారీ చేసిన నోటిఫికేషన్ విద్యాలయాలకు చేరింది. ఆన్‌లైన్ ద్వారా అర్హుల నుంచి దరఖాస్తు స్వీకరణ జరుగనుంది.
దరఖాస్తుల గడువు
1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఈనెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. ఈనెల 18 నుంచి తేదీ నుంచి అడ్మిషన్లు జరుగుతాయి. విద్యార్థులకు మెరిట్ జాబితా ప్రకారం ప్రవేశాలను కల్పిస్తారు. లిస్టులో ఉన్నవారు మాత్రమే తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కేంద్రీయ విద్యాలయంలో సంప్రదించి ప్రవేశాలను పొందాలి. ఒకటో తరగతిలో ప్రవేశానికి 2025 మార్చి 31వ తేదీ నాటికి ఐదేళ్లు వయస్సు నిండి ఏడేళ్ల వయస్సు కలిగి ఉండాలి. రెండో తరగతికి అరేళ్లు, 3వ తరగతికి ఏడేళ్లు, 4వ తరగతికి ఎనిమిదేళ్లు, 5వ తరగతికి తొమ్మిదేళ్లు, ఆరో తరగతికి పదేళ్లు, ఏడో తరగతికి 11 ఏళ్లు, ఎనిమిదో తరగతికి 12 ఏళ్లు, తొమ్మిదో తరగతికి 13, పదో తరగతికి 14 ఏళ్లు నిండి ఉండాలి. ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో తరగతికి 40 చొప్పున సీట్లు ఉంటాయి. తాజాగా ఒకటో తరగతికి ప్రతి విద్యాలయంలో 40 చొప్పున ప్రవేశాలను నూతనంగా కల్పిస్తారు. ఆపై విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలనుకుంటే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఉన్నతస్థాయి అధికారులు, కేంద్ర మానవ వనరులమంత్రిత్వ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
వీరికి ప్రాధాన్యం
ప్రవేశాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ రంగంలో పనిచేసే వారికి తొలి ప్రాధాన్యత ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగులు(ఆర్టీసీ, ఎన్‌పీడీసీఎల్, తదితర) ఒకే సంతానం కలిగిన కుటుంబాల్లోని వారికి ప్రాధాన్యం ఉంటుంది. పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ, కేవీఎస్ ఉన్నతాధికారులు సిఫార్సు చేసిన విద్యార్థులకు ప్రవేశాల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి పరీక్ష ఉంటుంది. మూడు గంటల వ్యవధిలో 100 మార్కులకు పరీక్ష రాయాలి. హిందీ, ఆంగ్లం, గణితం, సైన్స్, సోషల్ పాఠ్యాంశాల్లో ఈ పరీక్ష ఉంటుంది. 100 మార్కులకు ఇతరులు కనీసం 33, ఎస్సీ,ఎస్టీ దివ్యాంగులు 25 మార్కులు సాధించాలి. ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు ప్రతిభ ఆధారంగా చేపడతారు. ఎస్సీలకు 15 శాతం(12 సీట్లు), ఎస్టీలకు 7.5 శాతం(6 సీట్లు), 3 శాతం సీట్లను దివ్యాంగులకు రిజర్వు అవుతాయి. మిగిలిన సీట్లు ఇతరులకు కేటాయిస్తారు.
సీటు లభిస్తే దశ తిరిగినట్లే
సీబీఎస్‌ఈ సిలబస్‌లో కేంద్రీయ విద్యాలయాల్లో బోధన ఉంటుంది. పిల్లలపై ఎటువంటి ఒత్తిడి లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తారు. ఒకటో తరగతి నుంచే సాంకేతిక పరిజ్ఞానంతో పరిచయం, శాస్త్ర సాంకేతికపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలు ఉంటాయి. మిగిలిన పాఠశాలలకు భిన్నంగా దీని పనివేళలు, సెలవులు ఉంటాయి. ఆటపాటలు, స్వేచ్ఛతో కూడిన విద్య అందుతుంది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నవోదయ స్కూల్స్‌ల్లో 9వ తరగతిలో ప్రవేశానికి ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుంది.
ఫీజు వివరాలు
అడ్మిషన్ పొందే విద్యార్థులు రూ.25 ప్రవేశ రుసుం చెల్లించాలి. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థి వరకు నెలకు రూ.500 చెల్లించాలి. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంప్యూటర్ బోధన కోసం అదనంగా నెలకు రూ.100 చెల్లించాలి. 9వ, 10వ తరగతి విద్యార్థులకు ట్యూషన్ ఫీజు కింద అదనంగా నెలకు రూ.200 చెల్లించాలి. 11,12వ తరగతి విద్యార్థులకు ట్యూషన్ ఫీజు కింద అదనంగా నెలకు రూ.400 చెల్లించాలి.