
తల్లిపాలు పిల్లలకు శ్రేష్ఠం
జగిత్యాలరూరల్: తల్లిపాలు పిల్లలకు ఎంతో శ్రేష్ఠమని జిల్లా సంక్షేమాధికారి బోనగిరి నరేశ్ అన్నారు. మంగళవారం జగిత్యాల రూరల్ మండలం మోరపల్లిలో పోషణ పక్షం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంగన్‌వాడీల్లో ఈనెల 8 నుంచి 22 వరకు పోషణపక్షం కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. గర్భిణులు, రెండేళ్లలోపు చిన్నారుల ఎత్తు, బరువు తీసి గ్రోతింగ్ నమోదు చేయడం జరుగుతుందన్నారు. గర్భిణులు, బాలింతలకు మొదటి వెయ్యి రోజుల ప్రాముఖ్యత గురించి వివరించారు. ప్రతీ చిన్నారికి ఆరునెలలు నిండే వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. సీడీపీవో మమత, గ్రామ ప్రత్యేకాధికారి నరేశ్, విండో చైర్మన్ మహిపాల్‌రెడ్డి, పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ మధుకుమార్, సూపర్‌వైజర్ లావణ్య, ఎంఎల్‌హెచ్‌పీ అనూష, ఏఎన్‌ఎం శిరీష, అంగన్‌వాడీ టీచర్లు పద్మరాణి, జమున, శైలజ పాల్గొన్నారు.
నిబంధనల ప్రకారం జీతాలు చెల్లిస్తాం
జగిత్యాల: మున్సిపల్‌లో పనిచేస్తున్న డ్రైవర్లకు వేతనాల్లో వ్యత్యాసం ఉందని ‘సాక్షి’ దినపత్రికలో ‘వేతనం.. వ్యత్యాసం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కమిషనర్ స్పందన స్పందించారు. శానిటరి ఇన్‌స్పెక్టర్ మహేశ్వర్‌రెడ్డిని సంబంధిత రికార్డులు అందించాలని ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలోని రికార్డులు పరిశీలించగా జీఎంఎస్ నంబరు 14, 60 ప్రకారం డ్రైవర్లందరికీ వేతనాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే జనవరి 24న 12 మంది కార్మికులకు పదోన్నతి కల్పించినట్లు దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించడం జరిగిందని, అర్హత, ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అర్హులకు నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇతర డ్రైవర్లతో సమానంగా జీతాలు చెల్లించేలా చూస్తామని పేర్కొన్నారు.
పెన్షన్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి
జగిత్యాలటౌన్: పాత పెన్షన్ విధానానికి హాని చేసేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన పెన్షన్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని జగిత్యాల పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. బిల్లును ఉపసంహరించుకోవాలని రాసి ఉన్న కార్డులను ప్రధాని మోదీకి పోస్టు ద్వారా పంపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్‌కుమార్ మాట్లాడుతూ, పెన్షన్ సవరణ బిల్లు చట్ట రూపంలోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అమలు చేస్తాయన్నారు. దీంతో రాష్ట్రంలోని పెన్షనర్స్ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. పెన్షనర్ల కడుపు కొట్టే ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్‌కుమార్, నాయకులు సీపీ హన్మంతరెడ్డి, గౌరిశెట్టి విశ్వనాథం ఉన్నారు.
బహిరంగ వేలం ద్వారా మామిడి కొనుగోళ్లు చేపట్టాలి
జగిత్యాలటౌన్: బహిరంగా వేలం ద్వారా మామిడి కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుని రైతులకు సరైన ధర వచ్చేలా చూడాలని మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. జగిత్యాలలోని రాజీవ్‌గాంధీ మ్యాంగో మార్కెట్లో మామిడి కొనుగోళ్లలో నిబంధనలు అమలు జరిగేలా చూడాలని కోరుతూ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌కు మంగళవారం లేఖ రాశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మామిడికాయలపై మచ్చలు ఏర్పడి నాణ్యతతో పాటు దిగుబడి తగ్గి రైతులు ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్నారని పేర్కొన్నారు. దీనికి తోడు 3 రకాల గ్రేడింగ్ పేరుతో రైతులను వ్యాపారులు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మార్కెటింగ్ శాఖ నిబంధనల ప్రకారం 4శాతం ఫీజు వసూలు చేయాల్సి ఉండగా 10శాతం వసూలు చేస్తుండటంతో రైతులపై మరింత భారం పడుతుందన్నారు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా మార్కెటింగ్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని లేఖలో కోరారు.

తల్లిపాలు పిల్లలకు శ్రేష్ఠం