
‘భూభారతి’పై ప్రచారం కల్పించాలి
జగిత్యాల: భూభారతి చట్టంపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం భూభారతిపై అధికారులతో సమావేశమయ్యారు. భూభారతి చట్టంపై తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, గెజిట్ రూల్స్‌ను రెవెన్యూ శాఖలో ప్రతి అధికారి తెలుసుకోవాలన్నారు. చట్టంలో రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఉందన్నారు. ఇకపై రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసే సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరిగా అవసరం అవుతుందన్నారు. ప్రతిరోజు కనీసం రెండు అవగాహన కార్యక్రమాలు జరగాలని, రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ఈ చట్టం ముందుగా పైలెట్ ప్రాజెక్ట్ కింద నాలుగు మండలాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారని, వాటిని పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో భూ భారతి చట్టం అమలుకు అధికారులు సంసిద్ధం కావాలని, ప్రజల భూ సమస్యల పరిష్కారానికి పటిష్ఠ కార్యచరణ రూపొందించాలన్నారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ భూముల పెన్సింగ్, మార్కింగ్ వెంటనే పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు.
తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి
వేసవి దృష్ట్యా జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. తాగునీటి ఇబ్బందులున్న చోట యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. నాలుగు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లు సొంత స్థలంలో దరఖాస్తు చేసుకున్న వారికి మండల స్పెషల్ ఆఫీసర్లుగా కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, పథకం కింద అర్హులను ఎంపిక చేయాలన్నారు. త్వరలోనే నిధులు విడుదలయ్యేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్‌రెడ్డి, శ్రీనివాస్, మదన్‌మోహన్ పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యప్రసాద్