
కాంగ్రెస్ కార్యకర్తల కాళ్లలో కట్టె పెడుతున్నరు..
జగిత్యాలటౌన్: దశాబ్దకాలం బీఆర్‌ఎస్ పాలనలో పదవులు అనుభవించి.. స్వార్థ ప్రయోజనాల కోసం అభివృద్ధి పేరిట కాంగ్రెస్ ముసుగులో వచ్చి అసలైన కార్యకర్తల కాళ్లలో కొందరు కట్టెపెడుతున్నారని, వారి కట్టెలకన్న తమ కాళ్లు బలంగా ఉన్నాయని, కట్టెపెట్టాలని చూస్తే వారి కట్టె విరుగుతుందిగానీ తాము భయపడేదిలేదని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. జైభీం, జైబాపు, జైసంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని గాంధీనగర్ నుంచి మంచినీళ్ల బావి వరకు రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమం ఇన్‌చార్జి దినేష్ నాయకులు, కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నీతి, నిజాయితీ, నైతిక విలువలకు కట్టుబడి ఉందన్నారు. దశాబ్దకాలం పాటు బీఆర్‌ఎస్ అరాచక పాలనను ఎదిరించి పోరాడిన పార్టీ కార్యకర్తల కష్టంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, పదేళ్లు చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తామంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. అభివృద్ధి చేసేందుకు ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ బలోపేతానికి పనిచేస్తానని వెల్లడించారు. పీసీసీ కార్యదర్శి బండ శంకర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త మోహన్, గాజుల రాజేందర్, నక్క జీవన్ తదితరులు ఉన్నారు.
కొనుగోళ్లను వేగవంతం చేయాలి
రాయికల్: రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోళ్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. మండలంలోని అల్లీపూర్, ఉప్పుమడుగు, ఆలూరు, తాట్లవాయి, ఆల్యనాయక్‌తండా, రామాజీపేట గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల్లో వసతులు కల్పించాలని, గన్నీ సంచులు, లారీల కొరత లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. ఆమె వెంట తహసీల్దార్ ఖయ్యూం ఉన్నారు.