
భూ భారతితో సాదాబైనామాలకు పరిష్కారం
● కలెక్టర్ సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
సారంగాపూర్/కోరుట్ల రూరల్/జగిత్యాలరూరల్: సాదాబైనామాలపై కొనుగోలు చేసిన భూములకు భూ భారతిలో పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజ య్ కుమార్ పేర్కొన్నారు. భూభారతిపై బీర్‌పూర్‌లో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. పలువురు రైతులు అడిగిన భూ సమస్యల ప్రశ్నలకు కలెక్టర్ సమాధానం ఇచ్చారు. మండలంలో సాదా బైనామాలపై భూముల కొనుగోళ్లు, అమ్మకాలు సా గుతున్నాయని భూ భారతితో పూర్తిన్యాయం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నా రు. ఎస్సారెస్పీ ముంపు బాధితుల కోసం కేటాయించిన భూముల్లో అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయని, పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయని, మరికొంత మంది కొనుగోళ్లు చేసిన భూములను నోషనల్ ఖాతాలో చేర్చారని, ధరణిలో ఈ సమస్య పరిష్కారం జరగలేదని కొల్వాయి విండో చైర్మన్ పొల్సాని నవీన్‌రావు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. వీటికి భూభారతిలో పరిష్కారం దొరుకుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. బీర్‌పూర్‌లో రెవెన్యూ, అటవీ భూముల విషయంలో ప్రజలు, అధికారుల్లో అ యోమయం ఉందని, రైతుల రెవెన్యూ భూములను ధరణిలో అసైన్డ్ భూములుగా చూపడంతో సమస్య తలెత్తిందని ఎమ్మెల్యే సంజయ్ పేర్కొన్నా రు. రెవెన్యూ భూములను అటవీశాఖ అటవీభూములుగా పేర్కొంటోందని, సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు. ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ ముంతాజొద్దీన్, ఎంపీడీవో లచ్చాలు పాల్గొన్నారు.
కోరుట్లలో...
భూ భారతి చట్టంలో భూ సమస్యల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థ ఉంటుందని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని అష్టలక్ష్మీ ఆలయ ప్రాంగణంలో అవగాహన సదస్సు నిర్వహించారు. చట్టంలోని వివిధ అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అధికారులు ఇచ్చిన ఆర్డర్లపై సంతృప్తి చెందకుంటే బాధితుడు ఆర్డీవోకు అప్పీల్ చేసుకోవచ్చని, అక్కడ కాకుంటే కలెక్టర్, ట్రిబ్యునల్‌కు కూడా వెళ్లే వెసులుబాటు ఉందన్నారు. ఆర్డీవో జీవాకర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, ఇన్‌చార్జి తహసీల్దార్ ఎంపీడీవో రామకృష్ణ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్‌లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. సెంటర్లలో అవకతవకలు జరగకుండా చూడాలని, సీరియల్ రిజిస్టర్ ప్రకారం ధాన్యం మ్యాచింగ్ చేయాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని 24 గంటల లోపు మిల్లులకు తరలించాలన్నారు. ట్యాబ్ డేటా ఎంట్రీ నమోదు, లారీ ట్రక్ సెట్ తప్పనిసరిగా ఎంట్రీ చేయాలన్నారు. కలెక్టర్ వెంట జగిత్యాల రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్ ఉన్నారు.