జనగామ: జిల్లాలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో శానిటరీ సమస్యకు పరిష్కారం చూపించారు. శానిటరీ నాప్కిన్స్ సక్రమమైన పద్ధతిలో నిర్వీర్యం చేసేందుకు కలెక్టర్ రిజ్వాన్ బాషా ప్రత్యేక దృష్టి సారించారు. బాలికల సంపూర్ణ ఆరోగ్యం దృష్ట్యా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నాప్కిన్స్‌ను బర్న్ చేసే యంత్రాలను మంజూరీ చేశారు. ఇందుకు సంబంధించి డీడబ్ల్యూఓ శాఖ నుంచి ఒక్కో యంత్రానికి రూ.21వేలు ఖర్చు చేస్తూ రూ.2.52లక్షల నిధులు వెచ్చించారు. జనగామ జిల్లాలోని 12 కేజీబీవీల్లో ఇన్సినేరేటర్లను ఏర్పాటు చేయడంతో పాటు సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చారు. గతంలో నాప్కిన్స్‌ను డస్ట్‌బిన్‌లో వేయడంతో క్లీనింగ్ ప్రక్రియలో కొంత ఇబ్బందులు ఎదురయ్యేవి. వ్యర్థ పదార్థాలను కాల్చి వేయడంతో పాటు ఘన వ్యర్థాల పరిమాణాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతాయి. గాలి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుని, నాప్కిన్స్‌ను బర్న్ చేయాల్సి ఉంటుంది. బాలికలకు ఇన్సినేరేటర్లను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై అవగాహన కల్పించగా, వాటిని భస్మం చేసేందుకు స్కావెంజర్లు రోజువారీగా దృష్టి సారించాలి. బాలికలకు నా ణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు కలెక్టర్ చొరవ తీసుకుంటున్నారు. బర్న్ చేసిన వ్యర్థ పదార్థాలను (బూడిద) ఎక్కడ వేయాలనే దానిపై పలు సూచనలు చేసినట్లు జీసీడీఓ గౌసియా బేగం తెలిపారు. కలెక్టర్ చొరవ తీసుకుని ఇన్సినేరేటర్లను మంజూరు చేయడం జరిగిందన్నారు.
బాలికలకు ఉపయోగకరంగా యంత్రాలు
శానిటరీ నాప్కిన్స్ తొలగించేందుకు చర్యలు
జిల్లాలోని 12 కేజీబీవీలకు
రూ.2.52 లక్షలు మంజూరు