
రూ.50వేల నష్టపరిహారం చెల్లించాలి
జనగామ రూరల్: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు ప్రతీ ఎకరాలకు రూ.50వేల నష్టపరిహారం చెల్లించాలని రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందునాయక్ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో జరిగిన రైతు సంఘం జిల్లా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు పంటల బీమా పథకాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయలేదన్నారు. తక్షణమే ఫసల్ బీమాను రైతులకు అనుకూలంగా మార్చి చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. పంట నష్ట పరిహారం రూ.10వేలు ప్రకటించడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య, ఉపాధ్యక్షుడు మాచర్ల సారయ్య, మంగ బీరయ్య, జిల్లా సహాయ కార్యదర్శి రమావత్ మీట్యా నాయక్, రవీందర్ రెడ్డి, రాజవ్వ, నక్క యాకయ్య, లింగబోయిన కుమారస్వామి, ఉర్సుల కుమార్, రైతులు పాల్గొన్నారు.