
అభివృద్ధి చేతల్లో చూపిస్తాం..
పాలకుర్తిటౌన్: పాలకుర్తి అభివృద్ధిని మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తాం.. ఏం అభివృద్ధి జరుగుతున్నదో దయాకర్‌రావుకు చెప్పాల్సిన అవసరం తమకు లేదని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, నియోజకవర్గ నాయకులతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. చిన్న వయసులో ఎమ్మెల్యేగా తనకు అవకాశం దక్కిందని జీర్ణించుకోలేని నాయకులు బురద జల్లుతున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.450 కోట్ల నిధులు తీసుకువచ్చినట్లు చెప్పిన ఆమె.. తొర్రూరు, పాలకుర్తి ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేశామని, త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్లను తన హయాంలో పూర్తి చేస్తానని చెప్పారు. ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఆడబిడ్డలు అండగా ఉండటం కొందరికి రుచించడం లేదని, మమ్మల్ని, కాంగ్రెస్‌ను తక్కువ అంచనా వేయవద్దని సూచించారు. దయాకర్‌రావులాగా పాలకుర్తిలో దోచుకుని అమెరికాలో దాచుకోవడానికి ఇక్కడికి రాలేదని స్పష్టం చేశారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, జాటోతు హమ్యానాయక్, సీనియర్ నాయకులు ముత్తినేని సోమేశ్వరరావు, నెమరుగొమ్ముల ప్రవీణ్‌రావు, గిరగాని కుమారస్వామి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ లావుడ్య మంజుల, చాపల బాపురెడ్డి, రాజేష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి