
నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు
సామాన్య ప్రజల కోసమే ‘భూ భారతి’ చట్టం
● రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
● భూ భారతి పైలట్ మండలం వెంకటాపురం (ఎం)లో రెవెన్యూ సదస్సు
● హాజరైన మంత్రులు ధనసరి సీతక్క, కొండా సురేఖ తదితరులు
వెంకటాపురం(ఎం)/ములుగు: అర్హులైన పేదలందరికీ పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ఈ నెలాఖరులోగా ప్రతీ గ్రామంలో ప్రారంభిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూ భారతి పైలట్ మండలంగా ఎంపిక చేసిన ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సుకు మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖలతో కలిసి ఆయన హాజరయ్యారు. పలువురు రైతులనుంచి దరఖాస్తులు స్వీకరించి రశీదులు అందజేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ పేరు వింటేనే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. జిల్లాలో గిరిజనులు, గిరిజనేతరులు ఉన్నారని, ఈ ప్రాంత సమస్యలపై ప్రత్యేక కమిటీ వేసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని చెప్పారు. రైతుల వద్దకే వెళ్లి అధికారులు భూ సమస్యలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు.
రైతును రాజు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ : మంత్రి కొండా సురేఖ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిరంతరం రైతుల గురించి ఆలోచించి రైతును రాజుగా చేశారని మంత్రి కొండా సురేఖ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు న్యాయం చేసేందుకే భూభారతి చట్టాన్ని తీసుకు వచ్చారని చెప్పారు. రైతులను ఇబ్బందులు పెట్టకుండా అధికారులు సేవలందించాలని, తప్పు చేసే వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
భూమికి రైతుకు ఉన్న బంధమే
తల్లీబిడ్డ సంబంధం: మంత్రి ధనసరి సీతక్క
తల్లీబిడ్డకు ఎలాంటి సంబంధం ఉంటుందో భూమికి రైతుకు అలాంటి బంధం ఉంటుందని, గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చి రైతుల ఆత్మహత్యలకు కారణమైందని మంత్రి సీతక్క అన్నారు. నేడు రైతుల సమస్యలను పరిష్కరించడానికి సీఎం రేవంత్‌రెడ్డి భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చారని చెప్పారు. కార్యక్రమంలో మహబూబాబా ద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, కేఆర్.నాగరాజు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, కలెక్టర్ దివాక ర టీఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీఓ వెంకటేష్, తహసీల్దార్ గిరిబాబు, ఎంపీడీఓ రాజు తదితరులు పాల్గొన్నారు.

నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు

నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు

నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు