నువ్వక్కడ.. నేనిక్కడ
● భూపాలపల్లిలో మగపులి..
మంచిర్యాలలో ఆడపులి సంచారం
కాళేశ్వరం :మహదేవపూర్ మండలం గోదావరి పరివాహాక ప్రాంతం అడవుల్లో మగపులి సంచారం చేస్తుండగా..గోదావరి అవతలి ఒడ్డుకు మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ పరిసరాల్లో ఆడపులి కలియ తిరుగుతోంది. 12 రోజులుగా కాటారం, మహదేవపూర్ అడవుల్లో తచ్చాడిన పెద్దపులి వచ్చిన దారిగుండానే శుక్రవారం నస్తూర్‌పల్లి అడవి బాటపట్టినట్లు అటవీ శాఖ అధికారులు పాదముద్రలను గుర్తించారు. ఆడపులి మాత్రం మగపులి రాక కోసం దాంపూర్ అడవుల్లోనే మూడ్రోజులుగా తలదాచుకుందని తెలిసింది. గురువారం అక్కడే ఓ గేదెను చంపినట్లు అక్కడి అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో ఈ రెండు జతకట్టడానికే (మేటింగ్) పన్నెండు రోజులుగా రోజుకో చోట తిరుగుతున్నాయి. 15–20 కిలోమీటర్ల మేర మగపులి జాడను అటవీశాఖ అధికారులు నాలుగు బృందాలతో అన్వేషిస్తున్నారు. అక్కడక్కడా ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేసినా చిక్కకుండా, అధికారుల కన్నుల్లో పడకుండా ఏమార్చి తిరుగుతోంది. ఎక్కడా ఎలాంటి దాడులు కూడా చేయకుండా తెలివిగా తప్పించుకుంటోంది. మగ, ఆడపులి జతకట్టే (మేటింగ్) సమయం కావడంతో వాటి వాసన పసిగడుతూ కచ్చితంగా గోదావరి దాటే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ రెండు పులులు దరి చేరాలంటే వాటి మధ్య 30 కిలోమీటర్ల దూరమే ఉంది. గోదావరి దాటి కలిసిపోయి పులుల ప్రేమ ఫలిస్తుందా! లేదా మగపులి వచ్చిన దారిన ఇంద్రావతి వైపు మరలిపోయి విఫలం అవుతుందా తెలియాల్సి ఉంది.
నేడు విద్యుత్ సరఫరాకు
అంతరాయం
భూపాలపల్లి రూరల్: నేడు (శనివారం) పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో కొత్త ట్రాన్స్‌ఫర్మర్ పనులు చేస్తున్నందున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ ఏఈ విశ్వాస్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 6 ఇంక్లైన్ రోడ్డు, ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిసర ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందన్నారు.
రేపు గురుకుల
ప్రవేశ పరీక్ష
భూపాలపల్లి అర్బన్: ఈనెల 23న జిల్లాలో ఉమ్మడి గురుకులాల ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల జిల్లా కోఆర్డినేటర్ గోల్కొండ భిక్షపతి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 5నుంచి 8వ తరగతులకు ప్రవేశ పరీక్ష, 9వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, లింగాల క్రాస్, గాంధీనగర్, కాటారం గురుకుల పాఠశాలలో ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2,360 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment