సాగునీరు అందించేందుకు చర్యలు
భూపాలపల్లి: రబీ పంటకు అవసరమైన నీటి సరఫరా కోసం తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రబీ పంటకు రైతులకు ఇబ్బందులు కలగకుండా పంటలకు సమృద్ధిగా సమయానికి సాగు నీరు అందించేందుకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో నీటి పరిస్థితి, కాలువల ద్వారా నీటి సరఫరా, భూగర్భ జలాల స్థితిగతులు మొదలైన అంశాలను అధికారులు పరిగణలోకి తీసుకుంటూ పంటలు ఎండిపోకుండా సంరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో గత రబీ సీజన్లో 86వేల ఎకరాల్లో పంట సాగు జరిగిందని, ఈ రబీ సీజన్లో 82 వేల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందన్నారు. గత సంవత్సరం నీరందక పంటలు ఎండిపోయిన ప్రాంతాలను, భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాలను గుర్తించి ప్రత్యాన్మయ ఏర్పాట్లుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే యూరియా కొరత లేకుండా చూడాలని, టాస్క్‌ఫోర్స్ టీంలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేస్తూ స్టాక్ వివరాలు పరిశీలించాలని ఆదేశించారు. ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తే పీడీ యాక్టు నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, డీఏఓ విజయ్‌భాస్కర్, ఇరిగేషన్, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికలకు పకడ్భందీ ఏర్పాట్లు
ఈ నెల 27న నిర్వహించనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల ఏర్పాట్లపై శుక్రవారం ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం ఐడీఓసీ కార్యాలయం నుంచి పాల్గొన్న కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో పోలింగ్ స్లిప్పుల పంపిణీ 90 శాతం పూర్తయిందన్నారు. శనివారం వరకు మిగిలిన 10శాతం పూర్తి చేస్తామని తెలిపారు. భూపాలపల్లి డివిజన్‌లో 7, కాటారం డివిజన్‌లో 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 76 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment