కాళేశ్వరం: సరస్వతి నది పుష్కరాల పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. గురువారం ఆయన ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి మే 15నుంచి 26 వరకు జరిగే పుష్కరాల సందర్భంగా చేపడుతున్న పనులపై ఈఓ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా పంచాయతీరాజ్, విద్యుత్, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, వైద్యఆరోగ్యశాఖ, దేవస్థానం అధికారులతో పనులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 25వరకు పుష్కరాల అన్ని పనులు పూర్తి ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో జాప్యం తగదని హెచ్చరించారు. ముఖ్యంగా ఘాట్లు, రోడ్లు, శానిటేషన్, తాగునీటి సదుపాయాల పనులను గడువులోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిపై ప్రతీవారం సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల నిర్వహణలో సంబంధిత శాఖల సమన్వయం ఎంతో ముఖ్యమన్నారు. వీఐపీ ఘాట్ నుంచి స్నానఘట్టాల వరకు అప్రోచ్ రోడ్డు నిర్మాణం, సరస్వతి తల్లి విగ్రహ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం గోదావరిలో నీటి నిల్వలు పరిశీలించారు. మే మాసం వరకు ఎంత మేరకు నీరు ఉంటుందో పర్యవేక్షణ చేయాలని ఇరిగేషన్ ఈఈని ఆదేశించారు. త్రివేణి సంగమం వరకు భక్తులు వెళ్లడానికి అనువుగా మట్టి రోడ్డు నిర్మాణం చేసి చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ వాచ్ టవర్ ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనాల పార్కింగ్ స్థలాలు గుర్తించి నివేదిక అందజేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మధుసూదన్, డీపీఓ నారాయణరావు, అడిషనల్ ఎస్సీ బోనాల కిషన్, సీఐ రామచందర్‌రావు, విద్యుత్ శాఖ డీఈ పాపిరెడ్డి, దేవస్థానం ఈఓ మహేశ్, ఆర్కిటెక్చర్ సూర్యనారాయణ, ఎస్సై తమాషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ
పుష్కరాల పనుల్లో వేగం పెంచాలి