గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
భూపాలపల్లి రూరల్: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మారుమూల అటవీ గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం డీసీసీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్ రెడ్డితో కలిసి భూపాలపల్లి మండలంలో రూ.4.73 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందించేలా చూస్తున్నామన్నారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, బస్సులకు మహిళలను ఓనర్లను చేసినట్లు తెలిపారు. ప్రతీ మహిళ ఆర్థికంగా ఎదగాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 12 మంది సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో మండలపార్టీ అధ్యక్షుడు సుంకరి రామచంద్రయ్యతోపాటు ఆయాగ్రామాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment