పనుల ప్రతిపాదనలు సమర్పించాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: కాళేశ్వరంలో సరస్వతీనది పుష్కరాలకు చేపట్టనున్న తాత్కాలిక ఏర్పాట్ల పనులకు సంబంధించిన అంచనా ప్రతిపాదనలు త్వరితగతిన సమర్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్, దేవాదాయ, పర్యాటక ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో శాశ్వత పనులకు అంచనాలు అందజేశారని, కొన్ని తాత్కాలిక పనులు చేపట్టాల్సి ఉన్నందున మరోమారు ప్రతిపాదనలు అందజేయాలన్నారు. పుష్కరాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి సారించేందుకు జోన్ల వారీగా విభజించి, ప్రత్యేక పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి, వివిధ శాఖల ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఆర్టీసీ, పోలీసు, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.
భూముల కేటాయింపునకు
చర్యలు తీసుకోవాలి..
చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన భూముల కేటాయింపునకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అటవీ భూముల కేటాయింపుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాటారం, మహదేవపూర్ మండలాల్లో ప్రాజెక్టుకు అవసరమైన అటవీ భూముల కేటాయింపు, రేగొండ మండలం బుద్దారం నుంచి రామన్నగూడెం తండా వరకు రహదారి నిర్మాణానికి అవసరమైన భూముల కేటాయింపు విషయమై అటవీ శాఖ అధికారులతో సమీక్షించారు. అటవీ, రెవెన్యూ, సర్వే, ఆర్‌అండ్‌బీకి అవసరమైన భూముల కేటాయింపునకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment