ఉపాధి హామీ కూలీలను పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి హామీ కూలీలను పెంచాలి

Published Sat, Apr 5 2025 1:29 AM | Last Updated on Sat, Apr 5 2025 1:29 AM

ఉపాధి హామీ కూలీలను పెంచాలి

ఉపాధి హామీ కూలీలను పెంచాలి

భూపాలపల్లి అర్బన్‌: ఉపాధి హామీ పనులకు కూలీలను పెంచాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ ఎంపీడీఓలను ఆదేశించారు. ఉపాధిహామీ పథకం పనులు, సెర్ప్‌ కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులపై శుక్రవారం రెవెన్యూ, పంచాయతీరాజ్‌, డీఆర్‌డీఓ, గృహ నిర్మాణ శాఖ, మున్సిపల్‌ మండల ప్రత్యేక అధికారులతో కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఉన్నామని ఉపాధి హామీ పథకం పనులు పెద్దఎత్తున చేపట్టేందుకు కూలీలను మొబలైజ్‌ చేయాలని ఎంపీడీఓలకు సూచించారు. మూడు నెలలు అత్యంత కీలకమని.. మూడు నెలల్లో 80 రోజుల పని దినాలు పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కూలి రేటు రూ.300 నుంచి రూ.307లకు పెంచినట్లు తెలిపారు. డిమాండ్‌కు తగినట్లు పనులు జరిగేలా కార్యాచరణ తయారు చేయాలన్నారు. మహదేవపూర్‌, మహాముత్తారం, పలిమెల మండలాల్లో 5వేల మంది రైతుల భూముల్లో వెదురు పెంపకం చేపట్టేందుకు ఈ నెల 15వ తేదీ వరకు రైతులను ఎంపిక చేయాలన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు 50 శాతం మహిళా సంఘాలకు కేటాయించాలని, మహిళా సంఘాల జాబితా తయారు చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ఎంపిక చేసిన సంఘాలకు శిక్షణ ఇవ్వాలన్నారు. చేయూత (వృద్ధాప్య పింఛను) పొందుతున్న వ్యక్తి భర్త లేదా భార్య మరణిస్తే వారిలో జీవించి ఉన్న ఒకరికి పింఛను మంజూరు చేసేందుకు మున్సిపల్‌, మండల స్థాయిలో విచారణ నిర్వహించి నివేదిక అందజేయాలన్నారు. భూపాలపల్లి, కాటారం డివిజన్‌లో మహిళా స్వయం సహాయ సంఘాలకు పెట్రోల్‌ బంకులు ఏర్పాటుకు భూమి కేటాయింపు చేయాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో 559 పనులు పెండింగ్‌లో ఉన్నాయని, పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించేందుకు ఈ నెల 11వ తేదీ వరకు అన్ని బిల్లులు అందజేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. కాటారం డివిజన్‌లో మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నివేదిక అందజేయాలన్నారు. మంజూరైన ఇండ్ల పనులు చేపట్టేందుకు తక్షణమే మార్కింగ్‌ చేయాలని ఆదేశించారు. ఇండ్లు ప్రగతి వివరాలను ఎంపీడీఓలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్‌, విజయలక్ష్మి, కాటారం సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌, డీఆర్‌డీఓ నరేష్‌, పరిశ్రమల శాఖ అధికారి సిద్ధార్థ, జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖ అధికారి రాజేందర్‌, గృహ నిర్మాణ శాఖ పీడీ లోకిలాల్‌, ఆర్డీఓ రవి అన్ని మండలాల ప్రత్యేక అధికారులు ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌శర్మ

హెల్ప్‌ డెస్క్‌ల ఏర్పాటు

మున్సిపల్‌, ఎంపీడీఓ కార్యాలయాల్లో రాజీవ్‌ యువ వికాసం హెల్ప్‌ డెస్కులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు. రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణపై కలెక్టరేట్‌ నుంచి మండల ప్రత్యేక అధికారులు, రెవెన్యూ, పంచాయతీ రాజ్‌, పరిశ్రమలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎంపీడీఓ, మున్సిపల్‌ కార్యాలయాల్లో రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు ఈ పథకానికి 4,479 దరఖాస్తులు వచ్చాయని, ప్రజలకు తెలిసేలా గ్రామ, గ్రామాన విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన రాజీవ్‌ యువ వికాసం హెల్ప్‌ డెస్క్‌ను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement