
మూగజీవాలకు తాగునీరు అందిద్దాం
జనగామ: వేసవి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు పెరిగాయి. ఎక్కడా కులాయిలు అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు, పక్షుల దాహార్తి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ స్పందించాలి. ప్రభుత్వంతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలి. కుక్కలు, పక్షులు గొంతెండి మృత్యువాత పడకుండా ఇంటి ఆవరణ, భవనాల ముందు, ప్రధాన కూడళ్లలో నీటితొట్లు ఏర్పాటు చేసి ఎప్పుడూ తాగునీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పక్షులకు ఇంటిదాబా పైన తొట్టిలాంటి మట్టిపాత్రలు ఉంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నీటిని పోస్తూ ఉండాలి. వాటికి దాహం వేసిన సమయంలో అలవాటుగా రోజూ అక్కడికి వచ్చి దాహం తీర్చుకుంటాయి. వరంగల్ మహానగరంలో అయితే బల్దియా ఆధ్వర్యంలో సుమారు 300చోట్ల నీటితొట్టెలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాగే అన్ని మున్సిపాలిటీకేంద్రాల్లో ఏర్పాటుచేస్తే మంచిది. గ్రామాల్లో రోడ్డువెంట గతంలో నీటితొట్లు ఏర్పాటుచేశారు. వాటిని శుభ్రం చేసి గ్రామ పంచాయతీవారు నీటిని నింపి పెట్టాలి.
– నాగ ప్రసాద్, పశువైద్యాధికారి, బచ్చన్నపేట

మూగజీవాలకు తాగునీరు అందిద్దాం