![మోదీ, చంద్రబాబు మెప్పు కోసమే దళితుల విభజన](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06mbnrl855-210066_mr-1738870843-0.jpg.webp?itok=zydidsGX)
మోదీ, చంద్రబాబు మెప్పు కోసమే దళితుల విభజన
మహబూబ్‌నగర్ రూరల్: ఎస్సీ వర్గీకరణ అంశం అసెంబ్లీలో పూర్తిగా అశాసీ్త్రయమైనదని, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా వర్గీకరణ చేపట్టారని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడిన మాలలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మోసం చేశారని అన్నారు. వర్గీకరణకు పూర్తిగా మద్దతు ఇచ్చిన బీజేపీ.. వారు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎందుకు వర్గీకరణ అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ విషయం సీఎం రేవంత్‌రెడ్డికి తెలియదా అని అన్నారు. మోదీ, చంద్రబాబుల మెప్పు కోసమే రేవంత్‌రెడ్డి దళితులను విభజించారని ఆరోపించారు. 2011 జనాభా లెక్కలలో ఉపకులాల గణన జరగలేదని, తప్పుడు జనాభా లెక్కలతో వర్గీకరణ చేశారని అన్నారు. తెలంగాణ ఏర్పడి 11 ఏళ్లు దాటిన తర్వాత పాత లెక్కలను ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ జరగడమే శాసీ్త్రయం కాదని, మాలల జనాభాను పూర్తిగా తక్కువ చేసి చూపించారని ఆరోపించారు. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మాలలకు జరుగుతున్న అన్యాయంపై గడపగడపకు వెళ్లి పోరాట చైతన్యాన్ని నింపుతామని తెలిపారు. సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, రాష్ట్ర కోఆర్డినేటర్ బ్యాగరి వెంకటస్వామి, జిల్లా అధ్యక్షుడు జి.చిన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ గోనెల ఆనంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్, నాయకులు రవికుమార్, ఆంజనేయులు, యాదయ్య, శ్రీనివాస్, రవి, హరిప్రసాద్, సహదేవ్, సూర్య, రాజు, కిరణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment