తోడేస్తున్నారు..!
తుంగభద్ర నదిపై ఏపీకి చెందిన ఇసుకాసురుల పంజా
మరబోట్లతో తవ్వకాలు
తుమ్మిళ్ల దగ్గర ప్రతి రోజూ మరబోట్ల ద్వారా వచ్చి లారీల కొద్ది ఇసుకను తవ్వేస్తున్నారు. దీనిపై ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా చర్యలు లేవు. ఉచితం పేరుతో ఏపీ వారు వారి దగ్గర, జిల్లా సరిహద్దులో ఉన్న ఇసుక మొత్తం ఖాళీ చేస్తుంటే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది, ప్రజల అవసరాలు ఎలా తీరతాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ అఽధికారులతో మాట్లాడి హద్దు నిర్ణయించడం మానేసి,వారి వాహనాలను ఇవతలి హద్దులోకి వచ్చినా వదిలేస్తే దాని వల్ల ప్రభుత్వాదాయానికి గండి మాత్రమే ఉంటుందని అంటున్నారు. ఇకనైనా జిల్లా అవసరాలు, ప్రభుత్వ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ఈ ఇసుక దోపిడీపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రాజోళి: తుంగభద్ర నదిని అడ్డాగా చేసుకొని ఏపీకి చెందిన ఇసుకాసురులు ఇసుకను లారీలకు లారీలు తోడేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలోకి వచ్చి మరీ.. మరబోట్ల సాయంతో ఇసుక తోడివేత నిర్వహిస్తున్నారు. సరిహద్దు చొచ్చుకొని ఇవతలికి వచ్చి.. రాత్రింబవళ్లు ఇసుక తవ్వుతున్నా.. అడిగే జిల్లా అధికారులే లేకుండా పోయారు. ఇదే అలుసుగా ఏపీకి చెందిన ఇసుక వ్యాపారులు తుంగభద్ర నది ప్రవాహం ఉన్న సరిహద్దు గ్రామాలు అన్నింట్లో ఇసుక తవ్వేస్తున్నారు. ఇలా తవ్వుతూపోతే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో నాయకులు, అధికారులు తెలుసుకుని వాటికి అడ్డుకట్ట వేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
రెండు ప్రాంతాల నడుమ..
తుంగభద్ర నది రెండు ప్రాంతాల నడుమ ప్రవహిస్తుంది. అటు ఏపీలోని కర్నూల్ జిల్లా, ఇటు గద్వాల జిల్లాల నడుమ ప్రవహిస్తుండగా.. ఇరు ఆ ప్రాంతాల వారు ఇవే నీటితో పంటలు పండిస్తున్నారు. కానీ ఇసుక విషయంలో మాత్రం విభేదాలు తలెత్తుతున్నాయి. గతంలో ఇలాంటి సమస్య లేకపోయినా, ప్రస్తుతం తుంగభద్ర నదిలో ఇసుక తీసే విషయంలో తరుచూ సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇదిలాఉండగా, జిల్లాలో ఉన్న నదుల్లో తుంగభద్ర ఒకటి. కాగా ఇసుక తీసుకునేందుకు జిల్లా అవసరాలకు, ప్రభుత్వ ఆదాయానికి కూడా ఇది వనరు. కాగా.. మన ఇసుక వాహనాల ద్వారా జిల్లాలోని ఇసుక అవసరాలకు అనుమతి ఉంది. అయితే దీని ద్వారా ఆన్‌లైన్‌లో చలాన్లు చెల్లించి ఇసుక అవసరమున్న వారు బుక్ చేసుకుంటున్నారు. దీని వల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయమే. కానీ అనుమతి ఉన్న వాహనాలు నదిలోకి ఇసుక కోసం వెళ్తే ఏపీ అఽధికారులు మా సరిహద్దులోకి వచ్చారంటూ.. జరిమానాలు విధిస్తున్నారు. కానీ ఏపీకి చెందిన వాహనాలు ఇటువైపు వచ్చినా ఇక్కడి అధికారులు కన్నెత్తి చూడకపోవడం విడ్డూరం. దీనిపై దృష్టి పెట్టాల్సింది పోయి, ఇసుక పక్కదారి పడితే కేసులు తప్పవని, ఉక్కు పాదం మోపాలని సాక్ష్యాత్తు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని జిల్లా వాసులు అంటున్నారు. ఏపీ అధికారులు కేసులు నమోదు చేస్తుంటే జిల్లా అధికారులు కేవలం సరిహద్దు పరిశీలనతో సరిపెట్టారని అంటున్నారు.
కదలిక లేని హద్దుల గుర్తింపు
జిల్లాలో ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి ఇసుకను అందించే వాహనాలను సైతం నదిలోకి ఏపీ అధికారులు రానివ్వడం లేదని ట్రాక్టర్ల యజమానులు చేసిన విజ్ఞప్తి మేరకు గద్వాల జిల్లా అధికారులు గత డిసెంబర్ నెలలో రాజోళి మండంలోని తూర్పు గార్లపాడు నుండి నది మధ్యలోకి వెళ్లి హద్దులను పరిశీలించారు. సర్వేయర్ మ్యాప్ ద్వారా జిల్లా హద్దు ఎక్కడి వరకు వస్తుందో సాధారణ అంచనా వేశారు. ఏపీ అధికారులతో మాట్లాడి ఉమ్మడి సర్వే చేస్తామని అన్నారు. కానీ నేటి వరకు దానిపై ఎలాంటి కదలిక రాలేదు. అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ నుండి అలంపూర్ దాకా తుంగభద్ర నది ప్రవహిస్తుంది. నది ఇటు వైపు జిల్లాలోని గ్రామాలు కాగా..నది అవతలి వైపు కర్నూల్ జిల్లాలోని గ్రామాలు. ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్న ఉచిత ఇసుక పథకం పేరుతో ఇసుక అక్రమంగా పక్కదారి పడుతందని ఆరోపణలు ఉన్నాయి. కేటాయించిన ఇసుక రీచ్‌లను కాదని నదిలో ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయని, ఆ క్రమంలోనే నది ఇటువైపునకు కూడా వస్తున్నారని జిల్లా వాసుల ఆందోళన.
రాష్ట్ర సరిహద్దులోకి వచ్చి మరబోట్లతో తోడివేత
ఉచితం పేరుతో వందల లారీలు తరలిస్తున్న వైనం
అనుమతులున్నా.. జిల్లా వాసులకు దక్కని ఇసుక
చర్యలు తీసుకుంటాం
ఏపీలోని వాహనాలు జిల్లా సరిహద్దుల వరకు వచ్చి అక్రమంగా ఇసుకను తీస్తున్నారని తెలిసింది. మైనింగ్ అధికారులతో మాట్లాడి ఆ వాహనాలపై ప్రత్యేక నిఘా పెడతాం. హద్దు సమస్య గురించి కూడా పైఅధికారులతో చర్చిస్తాం. అవతలి వాహనాలు ఇటు వైపు రాకుండా చూసేందుకు వెంటనే చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్‌రావు, ఆర్డీఓ, గద్వాల
తోడేస్తున్నారు..!
Comments
Please login to add a commentAdd a comment