2న వనపర్తికి ముఖ్యమంత్రి రాక
వనపర్తి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్చి 2న వనపర్తి జిల్లాకు రానున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. మంగళవారం ఎంపీ మల్లు రవి, నేతలతో కలిసి హైదరాబాద్‌లో అభివృద్ధి పనుల నివేదికను సీఎంకు ఆయన అందజేశారు. సుమారు రూ.వెయ్యి కోట్ల పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మంగళవారం కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య సమావేశమై సీఎం పర్యటన ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. సాయంత్రం కలెక్టరేట్ సమీపంలోని హెలీప్యాడ్‌ను ఎస్పీ పరిశీలించి బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు, వాహనాల పార్కింగ్ తదితర వాటిపై డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ కృష్ణకు సూచనలు చేశారు.
అభివృద్ధి పనులు ఇలా..
జిల్లా జనరల్ ఆస్పత్రిని 500 పడకలకు పెంచడం, ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్, జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల భవనం, ఇంటర్మీడియట్ కళాశాల, షాపింగ్ కాంప్లెక్స్, ఇందిరమ్మ ఇళ్ల పథకం, పెబ్బేరులో 30 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం జిల్లాకు వచ్చే నాటికి పనుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లా పర్యటనలో తన చిన్ననాటి స్నేహితులతో కొంత సమయం గడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment