శిథిలాల తొలగింపు షురూ | - | Sakshi
Sakshi News home page

శిథిలాల తొలగింపు షురూ

Published Fri, Feb 28 2025 1:48 AM | Last Updated on Fri, Feb 28 2025 1:44 AM

శిథిల

శిథిలాల తొలగింపు షురూ

అచ్చంపేట/ అచ్చంపేట రూరల్‌: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు ఇంకా బయటికి రాలేదు. టన్నెల్‌ నుంచి వారిని క్షేమంగా బయటికి తెచ్చే ఆపరేషన్‌ గురువారం మొదలైంది. సహాయక చర్యల్లో అధికారులు వేగం పెంచారు. లోకో ట్రైన్‌ మూడు డబ్బాల ద్వారా మట్టి శిథిలాలను తీసుకొచ్చారు. టీబీఎం మిషన్‌ ఉన్న ప్రాంతానికి లోకో ట్రైన్‌ పూర్తిగా చేరుకోలేకపోతోంది. 13.95 కి.మీ., వద్ద టీబీఎం మిషన్‌ ఉండగా చివరి వరకు లోకో ట్రైన్‌ వెళ్లేందుకు పట్టాలు ఉన్నాయి. అయితే భారీగా పేరుకుపోయిన మట్టి, బురద, సెగ్మెంట్లు, టీబీఎం శిథిలాల వల్ల టన్నెల్‌ చివరి వరకు లోకో ట్రైన్‌ వెళ్లలేకపోతోంది. ఈ రెండింటి మధ్య 300 మీటర్ల దూరం ఉంది. దీంతో టీబీఎం వరకు చేరుకునేందుకు లోకో ట్రైన్‌ పట్టాలు, సొరంగంలోని మట్టి, రాళ్లు, బురద తొలగించేందుకు కార్యాచరణను రెస్క్యూ బృందాలు చేపట్టాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే లోకో ట్రైన్‌ టీబీఎం చివరి వరకు చేరుకుంటుంది. ఆ తర్వాత టీబీఎం ఉన్న ప్రాంతంలోని శిథిలాలు తీసే పని మొదలవుతుంది. అప్పటివరకు టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల జాడ కనిపించే అవకాశం లేదు. ఈ ఆపరేషన్‌లో సింగరేణి బృందాలు కీలకంగా పని చేస్తున్నాయి. సొరంగం పైకప్పు కూలకుండా ప్రతిష్టమైన పునఃనిర్మాణం చేస్తున్నారు. సింగరేణితో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ, నేవీ, ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌, ఇతర బృందాలు కలిపి 20 మంది చొప్పున మూడు షిఫ్ట్‌లుగా పనిచేస్తున్నారు. అయితే దెబ్బతిన్న కన్వేయర్‌ బెల్టు మరమ్మతు మాత్రం చేపట్టలేకపోతున్నారు. సొరంగం లోపలికి వెళ్లేందుకు లోకో ట్రైన్‌ ఒక్కటే ఉండటం వల్ల అందులోనే సిబ్బంది వెళ్తూ.. దానిలోనే మట్టి తీసుకురావడం వల్ల కొంత కష్టంగా మారింది. అయితే తెగిపోయిన కన్వేయర్‌ బెల్ట్‌, ఆక్సిజన్‌ పైపులు పునరుద్ధరిస్తే సహాయక చర్యలు మరింత వేగవంతం అవుతాయి.

టీబీఎం మిషన్‌ కటింగ్‌..

టీబీఎం మిషన్‌ను కట్‌ చేసేందుకు జేపీ కంపెనీ సంస్థ యజమాని జయప్రకాష్‌ గౌర్‌ అనుమతి లభించింది. దీంతో గత అర్ధరాత్రి నుంచి గ్యాస్‌ కటింగ్‌ మిషన్‌తో టీబీఎంను కట్‌ చేసే పనులను వేగవంతం చేసినట్లు సమాచారం. ఇందులో 11 బృందాలతో పాటు ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ ప్రత్యేక నిపుణులు భాగస్వామ్యం అయ్యారు. ప్రమాద స్థలంసమీపానికి చేరుకొని పేరుకుపోయిన బురదను బయటికి పంపే చర్యలు చేపడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు సొరంగంలో చేపడుతున్న సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి.. అనే విషయాలను అధికార యంత్రం బయటికి పొక్కనివ్వడం లేదు.

కఠిన ఆంక్షలు..

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రాంతానికి వెళ్లడానికి ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు. కనీసం మీడియాకు కూడా అనుమతి ఇవ్వలేదు. రాజకీయ నాయకుల సందర్శనను తిరస్కరిస్తున్నారు. కేవలం రెస్క్యూ ఆపరేషన్‌ బృందాలు, అధికారులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. మరో 72 గంటల్లో సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొస్తాం అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో టన్నెల్‌ వద్ద సహాయక చర్యలు వేగవంతం అయ్యాయి. టన్నెల్‌ చుట్టూ ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఆంక్షలు విధించారు.

ఎన్‌జీఆర్‌ఐ ప్రత్యేక బృందం..

సొరంగంలో శిథిలాల కింద చిక్కుకున్న మానవ శరీరాలు గుర్తించేందుకు ప్రత్యేకంగా ఎన్‌జీఆర్‌ఐ ప్రత్యేక బృందం గురువారం ఉదయం సహాయ చర్యలు చేపట్టింది. సొరంగంలో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేకంగా గ్రౌండ్‌ ప్రోబింగ్‌ రాడార్‌ ఆంటీనాను ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా వారి ఆచూకీ లభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

మరికొన్ని వివరాలు..

● మధ్యాహ్నం 12.16 గంటలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎస్‌ఎల్‌బీసీ జేపీ కార్యాలయం వద్ద ఉన్న హెలీప్యాడ్‌ వద్దకు చేరుకున్నారు.

● 12.30 గంటలకు కార్యాలయానికి వచ్చారు. అంతకు ముందే కార్యాలయం ముందున్న మీడియా ప్రతినిధులను అక్కడి నుంచి గేటు బయటకు పోలీసులు పంపించారు.

● 2.16 గంటలకు బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు హరీశ్‌రావుతో పాటు పలువురు ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రాంతానికి వెళ్లారు. కొందరికే అనుమతి ఇవ్వడంతో రెండు కార్లలో ఉన్నవారు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించారు. 5 నిమిషాల తర్వాత సొరంగానికి పంపించారు. అక్కడి నుంచి వచ్చి ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు.

ముమ్మరంగా డీవాటరింగ్‌

టన్నెల్‌లో ప్రతి నిమిషానికి 5 వేల లీటర్ల నీళ్లు ఊరుతోంది. కూలిన రెండోరోజు నుంచే డీవాటరింగ్‌ చేస్తున్నా అదుపులోకి రాలేదు. రెండు రోజుల క్రితం నుంచి 100 హెచ్‌పీ మోటార్లతో ముమ్మరంగా డీవాటరింగ్‌ చేయడంతో పూడిక ఉన్న ప్రాంతం వరకు వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే సొరంగంలో చిక్కుకున్న వారి క్షేమంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రభుత్వం వారిని ఎలాగైనా రక్షించి బయటికి తేవాలనే కృతనిశ్చయంతో సహాయక చర్యలు చేపడుతోంది.

లోకో ట్రైన్‌ మూడు కోచ్‌ల ద్వారా మట్టి వెలుపలికి..

20 మంది చొప్పున మూడు షిఫ్ట్‌లో పనిచేస్తున్న రెస్క్యూ బృందాలు

ఈ ప్రక్రియ పూర్తయితేనే కార్మికుల జాడ

ఆరు రోజులైనా మరమ్మతుకు నోచుకోని కన్వేయర్‌ బెల్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
శిథిలాల తొలగింపు షురూ 1
1/1

శిథిలాల తొలగింపు షురూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement